రాజకీయాల్లోకి రానున్న నటుడు ఉపేంద్ర

- August 13, 2017 , by Maagulf
రాజకీయాల్లోకి రానున్న నటుడు ఉపేంద్ర

ప్రముఖ కన్నడ సినీనటుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, ‘రియల్‌ స్టార్‌’ ఉపేంద్ర తాను త్వరలో కర్ణాటకలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది మొదట్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించే శక్తిసామర్థ్యాలు, ఆలోచనలు ఉన్న వారికి వేదిక కల్పించేందుకు పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుత రాజకీయాలకు పూర్తి పారదర్శక ప్రత్యామ్నాయాన్ని అందించాలన్నది తన యోచన అని పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరులోని రుప్పీస్‌ రిసార్ట్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఖాకీ చొక్కా ధరించిన ఉపేంద్ర ‘ఈ దుస్తులు కష్టించి పనిచేసే ‘జన కార్మికుడి’కి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘మా పార్టీ జన నాయకుడిని, జన సేవకుడిని కాకుండా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే జన కార్మికుడికి ప్రతీక. నాతో నడవాలనుకునే వారు ఈ ఆలోచనతో ఉండాలి. ఖాదీకి బదులు ఖాకీ ధరించాలి. మాది బహిరంగ వేదిక. ప్రతి ఒక్కరూ కలసిరావాలి’ అని పిలుపునిచ్చారు.  

అన్ని స్థాయిల్లో పారదర్శకత
‘మా పార్టీలో అన్ని స్థాయిల్లో పారదర్శకత పాటిస్తాం. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదన్నదే మా ముఖ్యోద్దేశం’ అని ఉపేంద్ర చెప్పారు. తనతో కలసి వచ్చేవారితో చర్చించాక పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై పలుసార్లు సంకేతాలిచ్చిన ఉపేంద్ర శుక్రవారం ఓ ఆడియో క్లిప్పులో మరింత స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ‘మార్పు కోసం ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాజా ప్రకటనతో తెరపడింది.

తెలుగు, కన్నడ సినిమాలకు విరామం
పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సినిమాల్లో అవకాశాలను వదులుకున్నట్లు ఉపేంద్ర తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ఒక సినిమా ముగిశాక పూర్తి సమయం పార్టీ కోçసం కేటాయిస్తానని చెప్పారు. మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ నుంచి ఉపేంద్ర తప్పుకున్నట్లు తెలుస్తోంది.  ఉపేంద్ర 50కిపైగా సినిమా ల్లో నటించి, 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఉపేంద్ర’, ‘ఏ’, ‘టాస్‌’, ‘సన్నాఫ్‌  సత్యమూర్తి’ చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com