70 వసంతాల స్వాతంత్ర్యం - మేరా భారత్ మహాన్
- August 14, 2017
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటితో 7 దశాబ్దాలు పూర్తి అవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నేడు కీర్తింప బడుతున్న భారత దేశం అఖండ భారత దేశంగా ఇన్నాళ్ళు కొనసాగుతుందని మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన బ్రిటీష్ వారు కలలో కూడ ఊహించుకోలేదు అని చరిత్రకారులు అంటారు.
125 కోట్ల భారీ జనాభాతో ఎన్నో మతాలు సంస్కృతులు కులాల మధ్య భిన్నత్వంలో ఏకత్వంగా అజరామరంగా కొనసాగుతున్న భారతదేశ చరిత్రను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ 70 సంవత్సరాలలో ఎన్నో సవాళ్ళు సమస్యలు వైఫల్యాలు మన దేశాన్ని కుదిపేసినా మనదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తూనే ఉంది. ఈ 70 సంవత్సరాల సుధీర్ఘ కాలప్రవాహంలో మనం సాధించిన అతిపెద్ద ఘనత ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశ ప్రజాస్వామ్య మనుగడ మాత్రమే.
ఈరోజు ఎర్రకోట పై రెపరెపలాడే మువ్వన్నెల జండాను చూసిన ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన ఈ జెండాను చూసిన ప్రతి తెలుగువాడికి గర్వం ఉప్పొంగి పోతుంది. జవహర్ లాల్ నెహ్రూ నుండి నరేంద్ర మోడీ వరకు ఎందరో ప్రధానులు ఎర్రకోట బురుజులు నుండి భారత జాతికి దిశానిర్దేశం చేస్తూ ఎన్నో ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసారు.
అయితే స్వాతంత్రం లభించి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మనదేశ జనాభాలో దాదాపు 23 కోట్లమంది ఇప్పటికీ ఒకపూట భోజనం మాత్రమే చేసే నిరుపేద దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు అన్న వాస్తవాలు గుర్తుకు వచ్చినప్పుడు కనీసం మనదేశానికి 100 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకునే నాటికైనా మనదేశ పరిస్థితులు మారుతాయా అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న.
ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఎన్నో మనదేశాన్ని కుదిపేసినా సాంకేతిక ప్రగతిలో - ఆర్ధిక సరళీకరణల విధానంలో - అంతరిక్ష విజయాల చరిత్రలో మన భారతదేశం సాధించిన ప్రగతి పాశ్చాత్య దేశాలను కూడ ఆశ్చర్య పరుస్తోంది అన్నమాట వాస్తవం. ఇప్పటికీ మనదేశ జనాభాలో 20 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నా 80 కోట్ల మందికి పైగా ఉన్న ఓటర్లతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అలరారుతున్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అనేకసార్లు ఇచ్చినతీర్పు తలలు పండిన రాజకీయవేత్తల ఊహలను కూడ తారుమారుచేయగల శక్తి భారతీయ ఓటరుకి ఉంది.
ప్రస్తుతం ఎన్నో నిరాశ నిస్పృహలు భారత జాతిని పీడిస్తూ ఉన్నా ఈ ఆగష్టు 15రోజున వీధివీధిలో వాడవాడలా కనిపించే త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతి భారతీయుడు 'మేరా భారత్ మహాన్' అంటూ ఈ స్వాతంత్ర అరుణోదయానికి స్వాగతం పలకడం మన భారతీయుడి గొప్పతనం..
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







