ప్రముఖ కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్‌కు కీర్తి పురస్కారం

- September 02, 2017 , by Maagulf
ప్రముఖ కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్‌కు కీర్తి పురస్కారం

ప్రముఖ కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్‌ను తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారంతో సత్కరించింది. వరంగల్ శ్రీనివాస్ 26 సినిమాలకు గీత రచన చేయడంతో పాటు లంబాడీ, గోండు, కోయ, బెంగాలీ, ఒడిస్సీ, థిమ్స...ఇలా 18 భాషల్లో పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ సాంస్కృతిక శాఖలో రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 31న ఆయన్ని హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో సత్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ దాసరి నారాయణరావుగారి అడవి చుక్క సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశాను. 
అనంతరం అనేక ప్రజాదరణ పొందిన చిత్రాల్లో చక్కటి పాటలు రాసే అవకాశం లభించింది. నాట్లు వేస్తూ, నాగలి దున్నుతూ, కోతలు కోస్తూ, ఇస్సురాయి పడుతూ, వడ్లు దంచుతూ, శ్రమని మరిచిపోయే భజన, కాముడి పాటలు, బతుకమ్మ, బొడ్డెమ్మ, ఊయల, చిందు, ఒగ్గు, మందహెచ్చు, భాగోతం ఇలా ఎన్నో రాగయుక్తమైన పాటలు పాడి జనజీవన స్రవంతిని చైతన్య పరిచే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. సినీ కళామతల్లికి ఎప్పుడూ రుణపడి వుంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య టి. పాపిరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్.వి.సత్యనారాయణ, ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సత్తిరెడ్డి, ప్రజా సంబంధాల అధికారి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com