భారత్, మయన్మార్ మధ్య 11ఒప్పందాలు కుదుర్చుకున్న మోడీ

- September 07, 2017 , by Maagulf
భారత్, మయన్మార్ మధ్య 11ఒప్పందాలు కుదుర్చుకున్న మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మయన్మార్ పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు మయన్మార్‌లో బిజీగా గడిపిన ఆయన తిరుగు పయనమయ్యారు. టూర్‌లో చివరి రోజైన నిన్న ఉదయం యాంగన్‌లోని ష్వెడగాన్‌ పగోడాను సందర్శించారు. 2 వేల 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ పగోడాను మయన్మార్‌ సాంస్కృతిక వారతస్వ సంపదగా భావిస్తారు. దీన్ని సందర్శించి అక్కడి ప్రాంగణంలో బోధి మొక్కను నాటారు. తర్వాత కలిబరీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆంగ్‌శాన్‌ మ్యూజియమ్‌ను కూడా మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద, మొఘల్‌ వంశంలో చిట్టచివరి చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ టూర్‌లో మయన్మార్ స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌సాన్‌ సూకీ మోడీ వెంటే ఉన్నారు. 
మూడు రోజుల దైపాక్షిక పర్యటనలో మోడీ మయన్మార్ ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చించారు. తీవ్రవాదంపై పోరు సాగించడానికి మోడీ... మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూకీతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత మొత్తం 11 అగ్రిమెంట్లపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. సముద్ర గస్తీ, మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలను పటిష్టం చేయడం, ఆరోగ్యం, సాంకేతిక సమాచారం వంటి అంశాలు అగ్రిమెంట్ చేసినవాటిలో ముఖ్యమైనవి. ఈ పర్యటనతో పలు అంశాలపై భారత్, మయన్మార్ మధ్య సంబంధాలు బలపడ్డాయని తిరుగు ప్రయాణానికి ముందు మోడీ ట్వీట్  చేశారు. 
చైనాలో బ్రిక్స్‌ దేశాల సదస్సుకు హాజరైన మోడీ... అది ముగియగానే అక్కడి నుంచి మయన్మార్ టూర్‌కు వెళ్లారు. ఈ నెల 5న మయన్మార్ చేరుకున్న మోడీ ఆ దేశాధ్యక్షుడు టిన్‌గ్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆంగ్‌సాన్‌ సూకీతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మోడీ మయన్మార్‌కు ద్వైపాక్షిక పర్యటన కోసం వెళ్లడం ఇదే మొదటిసారి. 2014లో ఆసియాన్‌-భారత్‌ సదస్సు కోసం మయన్మార్ వెళ్లినా అది ద్వైపాక్షిక పర్యటన కాదు. ద్వైపాక్షిక చర్చలు విజయవంతం కావడంపై రెండు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com