పైరసీ బారి నుంచి సినిమా పరిశ్రమను కాపాడేందుకు కేటీఆర్
- October 28, 2015
పైరసీ బారి నుంచి సినిమా పరిశ్రమను కాపాడేందుకు తెలంగాణ ఐటీ శాఖ పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమా పరిశ్రమ, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పైరసీకి పాల్పడుతున్న వెయ్యి వెబ్‌సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా కోరారు. ప్రతి సినిమాకు కోర్టుల నుంచి ఆదేశాలు తీసుకుని, పైరసీ సైట్లను ఆపేయాలని కోరడం తమకు కష్టంగా మారిందన్నారు. సర్వీసు ప్రొవైడర్లు స్పందిస్తూ, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. పైరసీని అరికట్టేందుకు సహకరిస్తామని ముక్త కంఠంతో చెప్పారు. పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లను బ్లాక్ చేసేందుకు అంగీకరించారు. అయితే అందుకు అనుగుణంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పైరసీని అడ్డుకునే చర్యల్లో భాగంగా అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తామని కేటీఆర్ తెలిపారు. ''ఇది తెలుగుకే పరిమితం కాదు. సినీ పరిశ్రమంతా ఎదుర్కొంటున్న సమస్య. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న సినీ రంగానికి, దానిపై ఆధారపడ్డ వర్గాల భవిష్యత్తుకు పైరసీతో ఎంతో నష్టం. అందుకే దీనికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలూ చేపడతాం'' అని ఆయన ప్రకటించారు. పైరసీకి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, సినిమాకు ముందు ప్రత్యేక ప్రకటన ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. దేశంలోనే రెండో అతి పెద్ద సినీ పరిశ్రమ తెలుగేనని, పైరసీతో వందల కోట్ల నష్టం జరుగుతోందని సినీ పరిశ్రమ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. యూరప్ దేశాల్లో అమలు చేస్తున్న యాంటీ పైరసీ విధానాలను ఆయన దృష్టికి తెచ్చారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు సినీ నిర్మాతలు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







