విజయవాడ మెట్రో రైల్ ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
- September 17, 2017
అమరావతి మెట్రో రైల్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన మెట్రో పాలసీ ప్రకారం అమరావతికి హెవీ మెట్రో కష్టమేనని తేల్చేసింది. ప్రస్తుత బెజవాడ జనాభాకు తగ్గట్లుగా లైట్ మెట్రోకే వెళ్లాలని సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు కేంద్రం చేతులెత్తేసినట్లు తెలసింది. తాజా నిర్ణయంతో లైట్ మెట్రో ఏర్పాటుకు మరింత సమయం పట్టనుంది.
విజయవాడకు ఎలాంటి మెట్రో రైలు వస్తుంది? కొంత సేపు హెవీ మెట్రో అని.. మరికొంత సేపు లైట్ మెట్రో అని సర్కార్ చేస్తున్న ప్రకటనలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ అంశంపై క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ ను కలిశారు మంత్రి నారాయణ, మెట్రో అదికారులు. అయితే ఇటీవల తీసుకొచ్చిన కొత్త మెట్రో పాలసీతో విజయవాడకు లైట్ మెట్రోనే బెటర్ అని క్లారిటీ ఇచ్చేసారు కేంద్ర మంత్రి హరదీప్ సింగ్. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాలకు మాత్రమే హెవీ మెట్రో అవసరమని... కానీ ప్రస్తుతం బెజవాడ జనాభా 14 లక్షలు కాబట్టి లైట్ మెట్రో కే వెళ్లాలని సూచించారు. దీంతో మెట్రో ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టయింది. వాస్తవంగా విజయవాడకు లైట్ మెట్రో ఏర్పాటుచేయాలని నెలరోజుల క్రితమే ప్రభుత్వ నిర్ణయించింది. ఇటీవల మెట్రో శ్రీధరన్ అమరావతికి వచ్చి సీఎం, సీఎస్ లతో భేటీ అయిన తర్వాత ప్రభుత్వం సందిగ్దంలో పడింది. ఇప్పటికే హెవీ మెట్రోకు సంబంధించి డీపీఆర్ సిద్దం చేయడం, ఆ తర్వాత అనుమతి కోసం కేంద్రానికి పంపింది సర్కార్. ఈ ప్రతిపాదనలపై కేంద్రంతో సంప్రదిస్తే బాగుంటుందనే శ్రీధరన్ సూచనల మేరకు మంత్రి నారాయణ ఢిల్లీ వెళ్లారు. అయితే కేంద్ర మంత్రి ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో ఇక బెజవాడకు లైట్ మెట్రో తప్పనిసరి కానుంది.
వాస్తవంగా ఏపీ పునర్విభజన చట్టంలో విజయవాడ మెట్రోకు కేంద్రం సహకరించాలని ఉంది. అయితే విజయవాడ జనాభాకు తగ్గట్లు ఇప్పట్లో మెట్రో అవసరం లేదని సాకులు చెబుతూ కేంద్రం దాటవేత ధోరణిలో ఉంది. కేంద్రం గనుక హెవీ మెట్రోకు అనుమతిస్తే సర్ధుబాటు నిధుల కింద 20 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రతిపాదనలతో లైట్ మెట్రోకు కేంద్రం నుంచి కేవలం 10 శాతం నిధులు మాత్రమే రానున్నాయి. ఇక లైట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం మళ్లీ మొదటి నుంచి డీపీఆర్ తయారుచేసి.. దాన్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం అనుమతిస్తేనే లైట్ మెట్రో అయినా సాధ్యపడుతుంది. ఇదంతా పూర్తవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. ప్రాజెక్ట్ విషయంలో కాస్త ఆలస్యం అయినా ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గుతుందనేది ఏపీ ప్రభుత్వ వాదన. అంతేగాక హెవీ మెట్రో అయితే భూసేకరణ పెద్ద సమస్యగా ఉందని.. లైట్ మెట్రోకు పెద్దగా ఇబ్బందులుండడవని భావిస్తోంది సర్కారు. ఎలాగూ కేంద్రం కూడా లైట్ మెట్రోకే వెళ్లాలని చెప్పడంతో ఇక డీపీఆర్ తయారుచేసే పనిలో పడనుంది ఏపీ ప్రభుత్వం. మెట్రో శ్రీధరన్, అమరావతి మెట్రో కార్పొరేషన్ తో కలిసి లైట్ మెట్రో రైల్ కు ముందుకు వెళ్లేలా సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







