దసరా పండుగ సీజన్లలో టాలీవుడ్ సినిమాల సందడి

- September 21, 2017 , by Maagulf
దసరా పండుగ సీజన్లలో టాలీవుడ్ సినిమాల సందడి

టాలీవుడ్లో పండుగ సీజన్లలో సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి, దసరాల తర్వాత దీపావళికి కూడా సినిమాలు బాగానే రిలీజ్ అవుతాయి. ఈ దసరాకి రెండు పెద్ద సినిమాలు జైలవకుశ, స్పైడర్ వస్తున్నాయి. వీటితో పాటు చిన్న సినిమా మహానుభావుడు కూడా వస్తోంది. దసరా తర్వాత వచ్చే దీపావళికి కూడా సినిమాలు పోటీ పడుతున్నాయి. దీపావళికి వారం ముందు మూడు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వాటిల్లో ఒకటి రాజుగారి గది2.

వచ్చే నెల 19న దీపావళి పండుగ. దీనికి వారం ముందు వచ్చే సినిమాల్లో రాజుగారి గది2 ఒకటి. ఈ మూవీ వచ్చే నెల 13న విడుదలవుతోంది. హార్రర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి సక్సెస్ అయిన రాజుగారి గదికి సీక్వెల్ ఈ సినిమా. దీనికి కూడా ఓంకారే డైరెక్టర్. అయితే కీలక పాత్రల్లో నాగార్జున, సమంత నటిస్తున్నారు. అందుకే సినిమాపై క్రేజ్ ఎక్కువగా ఉంది. వీళ్ళతో పాటు సీరత్ కపూర్, షకలక శంకర్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ నటిస్తున్నారు. నిన్న రిలీజైన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

దీపావళి సీజన్లో వచ్చే మరో సినిమా ఆక్సిజన్. మాస్ హీరో గోపిచంద్ నటించిన కొత్త సినిమా ఇది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాశీఖన్నా, అను ఇమ్మానుయేలే హీరోయిన్లుగా నటించారు. ఎ.ఎమ్.రత్నం చాలా రోజుల తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించి, ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ వచ్చే నెల 12న విడుదలకు రెడీ అవుతోంది. 

ఇక వచ్చే నెల 12నే వస్తున్న మరో చిత్రం రాజా ది గ్రేట్. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రవితేజకి జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. రవితేజ ఇందులో అంధుడుగా నటిస్తున్నాడు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ ఉంది. ఆ మధ్య టీజర్ ని మెప్పించిన టీమ్, రీసెంట్ గా టైటిల్ సాంగ్ విడుదల చేసింది. ఈ మూడు సినిమాల్లో ఆక్సిజన్ పై అంతగా అంచనాలు లేకపోయినా... రాజుగారి గది, రాజా ది గ్రేట్ పైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వీటి వల్ల దిపావళి సీజన్ కూడా సందడిగా ఉండబోతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com