దుబాయ్ లో భారతీయుడు దారుణ హత్య...స్వదేశస్థుడే హతమార్చాడు

- September 22, 2017 , by Maagulf
దుబాయ్ లో భారతీయుడు దారుణ హత్య...స్వదేశస్థుడే హతమార్చాడు

దుబాయ్: జన్మభూమిని ..కన్నతల్లిని విడిచి పొరుగు దేశం వెళ్లిన ఆ యువకులు తగాదాలు పడ్డారు..ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో కర్కశంగా హతమార్చాడు. దుబాయిలో ఓ ప్రవాసీయ భారతీయదు దారుణ హత్యకు గురయ్యాడు. సాటి దేశస్థుడే ఆ వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపడం స్థానికంగా సంచలనం కల్గించింది. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం  జగిత్యాల మండలం, సోమన్‌పల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల చంద రవి రెండేళ్ల క్రితం దుబాయికి కార్మికునిగా వెళ్లాడు. అక్కడే తెలుగువారితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.   అయితే దుబాయిలోనే ఉంటున్న నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌కు చెందిన ఓ యువకుడితో  రెండు నెలల క్రితం ఓ విషయంలో గొడవ జరిగింది. అయితే దాన్ని రవి తీవ్రంగా  తీసుకోలేదు. కాగా గురువారం ఉదయం... రవి ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు ఆ యువకుడు వచ్చి.. చంద రవిని కత్తితో పొడిచి, దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అతడి కేకలు విని అడ్డుకోవడానికి స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఈలోపే అతడి కత్తి పోట్లకు రవి మృతి చెందాడు . హత్య చేసిన  ఆ యువకుడు పారిపోయాడు. ఈ విషయాన్ని తెలుగువాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబానికి కూడా విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు. కొద్ది నెలల్లో ఇంటికి వస్తాడనుకున్న భర్త.. చనిపోయాడన్న వార్త విని భార్య భవాని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. దుబాయి పోలీసులు ఈ  హత్యపై  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com