మృత్యువుతో పోరాడి ఓడిన ఇమాన్ అహ్మద్

- September 25, 2017 , by Maagulf
మృత్యువుతో పోరాడి ఓడిన ఇమాన్ అహ్మద్

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా పేరుగాంచిన ఇమాన్ అహ్మద్ ఇవాళ చనిపోయింది. అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ఇమాన్ మృతిని ధృవీకరించారు. 37 ఏళ్ల ఇమాన్.. పలు గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడంతో మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. గతంలో ఆమె కోలుకుంటున్నదని, సొంతంగా ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌ను కూడా వాడుతున్నట్లు చెప్పారు. ఆమెకు 20 మంది వరకు స్పెషలిస్ట్ డాక్టర్లు చికిత్స నిర్వహించినట్లు బుర్జీల్ హాస్పిటల్ తెలిపింది. బరువు తగ్గించుకునేందుకు ఈజిప్ట్ నుంచి గత ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చిన ఆమె.. వివాదాస్పద పరిస్థితుల్లో చికిత్స కోసం దేశం విడిచి యూఏఈ వెళ్లిన విషయం తెలిసిందే. మే నెల నుంచి అబుదాబిలోనే చికిత్స తీసుకుంటున్నది. 500 కిలోలకుపైగా బరువుతో గత మార్చి నెలలో ముంబై వచ్చిన ఇమాన్‌కు సైఫీ హాస్పిటల్‌లో సర్జరీ చేశారు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఆమె 324 కిలోల బరువు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. ఆమె ముంబై వదిలి వెళ్లే సమయంలో 176 కేజీల బరువుంది. అయితే ఆమెకు చేసిన చికిత్స తమకు సంతృప్తి కలిగించలేదని ఇమాన్ సోదరి ఆరోపించడంతో వివాదం మొదలైంది.

ఆమెను డాక్టర్లు కేవలం పబ్లిసిటీ కోసమే వాడుకుంటున్నారని ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను ఖండించిన సైఫీ హాస్పిటల్.. తదుపరి చికిత్స కోసం ఇమాన్‌ను అబుదాబి పంపించింది. ఆమె చికిత్స కోసం ఆసుపత్రి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఇమాన్‌కు సర్జరీ చేసిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా చెప్పారు.

ఆమె చికిత్సకు సుమారు రూ.3 కోట్లు ఖర్చు కాగా.. రూ.65 లక్షలు విరాళాలుగా వచ్చినట్లు ఆసుపత్రి వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com