అదరకొడ్తున్న 'ఖాకీ' థియేట్రికల్‌ ట్రైలర్‌.!

- October 17, 2017 , by Maagulf
అదరకొడ్తున్న 'ఖాకీ' థియేట్రికల్‌ ట్రైలర్‌.!

'పవర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణానికి ఎందుకు ఇవ్వరు సర్‌' అని ప్రశ్నిస్తున్నారు కార్తి. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'ఖాకీ'. ది పవర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనేది ఉపశీర్షిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. హెచ్‌.వినోత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. 'తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారి పక్కన జన సంచారం లేని ఇంట్లో జరిగిన' అంటూ ట్రైలర్‌ ప్రారంభమైంది. 'పోలీసోళ్లు వత్తారు.. చూత్తారు.. పోతారు.. ఈ జనాన్ని కాపాడేదెవరు'..

'25ఏళ్లుగా ఇన్‌ఫార్మర్‌గా ఉంటున్నా సర్‌. ఇంతవరకూ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు'.. అంటూ వినిపిస్తున్న సంభాషణలు చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. 'ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం చేయకపోతే జనం మనల్ని క్షమించరు సర్‌' అని కార్తి చెప్పడం సినిమాను సరికొత్త కథాంశతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

'మనం చెడ్డవాళ్ల నుంచి మంచి వాళ్లను కాపాడే పోలీసు ఉద్యోగం చేయడం లేదు. మంచివాళ్ల నుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం సర్‌' అంటూ కార్తి పలికిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇక కార్తి, అతని టీమ్‌ ఇసుకలో నుంచి లేవడం.. ఛేజింగ్‌ సన్నివేశాలు సినిమాను పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గిబ్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా 'ఖాకీ' తెరకెక్కిస్తున్నారు. కార్తీ ఓ నిజాయతీగల పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com