వేగాన్ని పెంచనున్న భారత రైల్వే

- October 20, 2017 , by Maagulf
వేగాన్ని పెంచనున్న భారత రైల్వే

దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో రైళ్ల వేగాలు పెరగనున్నాయి. 500 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని ప్రస్తుత ప్రయాణ సమయం కన్నా సుమారు 2 గంటల ముందుగానే చేరుకోవచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి ఉత్తర్వులు అందాయని రైల్వే సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీనికి అనుగుణంగా ప్రయాణ వేళల్లో కూడా మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ విధానం నవంబర్‌ నెల నుంచి అమలులోకి వస్తుందన్నారు. కొత్త కాలమాన పట్టిక అమల్లోకి వస్తే ప్రయాణ సమయం 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రయోగాత్మకంగా 50 రైళ్లలో కొత్త టైం టేబుల్‌ను అమలు పరచనున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం గంట నుంచి రెండు గంటల వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. అనంతరం ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా 500 రైళ్లలో ప్రవేశపెట్టనున్నారు.

దీనిలో భాగంగానే రైల్వేశాఖ వివిధ మార్గాల్లో 50 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌ సర్వీసులుగా మార్చనుంది. రైళ్ల సరాసరి వేగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారి వివరించారు. దీనివల్ల భోపాల్‌ నుంచి జోధ్‌పూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ 95 నిమిషాల ముందుగానే చేరుకుంటుంది. గువాహటి నుంచి ఇండోర్‌ వెళ్లే ప్రత్యేక రైలు 2,330కి.మీ దూరాన్ని 115 నిమిషాల ముందుగానే పూర్తి చేస్తుంది. అలాగే, ఘజియాపూర్‌ నుంచి బంద్రా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు 1929 కి.మీ ప్రయాణ సమయం 95 నిమిషాలు తగ్గుతుంది.
ట్రాక్‌ల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల రూపకల్పన, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తే లింకే హాఫ్మ్‌న్‌ బుష్‌ కోచ్‌లు అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలవని ఆయన తెలిపారు. అంతేకాకుండా శాశ్వత వేగ పరిమితులపై రైల్వేశాఖ సమీక్ష నిర్వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com