ఉత్తరకొరియాకు భారతదేశపు హ్యాకర్ల సాయం..

- October 20, 2017 , by Maagulf
ఉత్తరకొరియాకు భారతదేశపు  హ్యాకర్ల సాయం..

రాత్రివేళల్లో ఉపగ్రహాలు తీసే ఛాయాచిత్రాల్లో ప్రపంచం మొత్తం కాంతులీనుతూ కనిపిస్తుంది. కానీ ఉత్తరకొరియా మాత్రం చిమ్మచీకట్లో ఉంటుంది. అక్కడ విద్యుత్తే సరిగా ఉండదు. ఉన్న కొద్దిపాటి విద్యుత్తులో సైనిక అవసరాలకు పోను మిగిలినది పరిమితంగా వాడుకొంటారు. అలాంటి ఉత్తరకొరియా సైబర్‌ వార్‌లో మాత్రం పశ్చిమ దేశాలను సవాలు చేసే స్థితిలో ఉంది.
దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థలపై ఉత్తరకొరియా భారీగా సైబర్‌ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో చాలా పరిమితంగా సొంత దేశం నుంచి చేస్తుంది. మిగిలినవి విదేశాల్లోని హ్యాకర్లను ఉపయోగించుకొని చేయిస్తోంది. ఈ ఉత్తరకొరియాకు ఉపయోగపడే హ్యాకర్లలో కొంత మంది భారత్‌లో కూడా ఉన్నారట. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా ఓ కథనంలో పేర్కొంది.
జూనియర్‌ కిమ్‌ రాకతో పెరిగిన సైబర్‌ దాడులు 
కిమ్‌ జొంగ్‌ ఉన్‌ తండ్రి కిమ్‌ జొంగ్‌ ఇల్‌ హయాంలో 1990 వరకు ఉత్తర కొరియా వద్ద అతి తక్కువ మంది సైబర్‌ నిపుణులు ఉన్నారు. కంప్యూటర్లు కూడా అంతంతమాత్రంగా ఉండేవి. కానీ తర్వాత ఇల్‌ దేశానికి సైబర్‌ నిపుణుల అవసరాన్ని గుర్తించాడు. నెమ్మదిగా వారి సంఖ్యను పెంచడం ప్రారంభించాడు. ఆయన మరణానంతరం కిమ్‌ జొంగ్‌ ఉన్‌ బాధ్యతలు చేపట్టాక సైబర్‌ దళాన్ని భారీగా పెంచేశాడు. ఇక్కడి హ్యాకర్లు అతిపెద్ద సైబర్‌ దాడులను చేశారు. 2014లో కిమ్‌ జొంగ్‌ ఉన్‌పై ఓ హాస్య చిత్రాన్ని నిర్మిస్తున్న సోనీ పిక్చర్స్‌ను హ్యాక్‌ చేశారు. ఈ దెబ్బకు సోనీ ఆ చిత్ర విడుదలను నిలిపేసింది.
మరోపక్క అమెరికా, దక్షిణ కొరియాలు కూడా ఉత్తరకొరియాకు చెందిన న్యూక్లియర్‌, క్షిపణుల సాఫ్ట్‌వేర్లను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోన్నాయి. కానీ ఉత్తరకొరియా పాతకాలం హార్డ్‌వేర్‌లు వాడుతుండటంతో అమెరికా, దక్షిణ కొరియాలకు కష్టంగా మారింది. ఉత్తరకొరియా హ్యాకింగ్‌ బృందాలు ప్రపంచవాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిల్లో భారత్‌ కూడా ఉంది.
భారత్‌లో ఇలా.. 
అమెరికాకు చెందిన 'రికార్డెడ్‌ ఫ్యూచర్‌' అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. ''ఉత్తరకొరియా చేసే మొత్తం సైబర్‌ దాడుల్లో ఐదోవంతు భారత్‌ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఉత్తర కొరియా సైబర్‌ బృందాలు భారత్‌లో పనిచేస్తున్నాయి. భారత్‌- ఉత్తర కొరియాల మధ్య పలు అంశాల్లో సంబంధాలు ఉన్నాయి. భారత్‌లోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ఉత్తర కొరియా విద్యార్థులు చదువుకుంటున్నారు. దీంతోపాటు ప్రభుత్వ, పరిశోధనా విభాగాల్లో కూడా వారు పనిచేస్తూ ఉండి ఉండవచ్చు.''
''భారత్‌లోని కీలక సంస్థలపై కూడా వారు దాడులు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, ఇండియన్‌ నేషనల్‌ మెటలార్జికల్‌ లేబరేటరీలను ఈ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయంలో భారత్‌కు ఎటువంటి దురుద్దేశాలు ఉండకపోవచ్చు'' అని తెలిపింది.
గతంలో భారత్‌ ఉత్తర కొరియాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ కిమ్‌ జంగ్‌ ఉన్‌ అధికారం చేపట్టాక భారత్‌ కొంత దూరం పాటిస్తోంది. అమెరికాతో సంబంధాలు బలపడే కొద్దీ ఉత్తరకొరియాను దూరం పెడుతోంది. ఇటీవల ఉత్తరకొరియాపై ఆంక్షలను మోదీ ప్రభుత్వం సమర్థించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com