బాలసుబ్రమణ్యంతో విభేదాలు లేవు : ఇళయరాజా

- November 04, 2017 , by Maagulf
బాలసుబ్రమణ్యంతో విభేదాలు లేవు : ఇళయరాజా

ఎస్పీ బాలసుబ్రమణ్యంతో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు ఇళయరాజా. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరయిన ఈ మ్యూజిక్‌ మాస్టర్‌ బాలుతో విబేధాలపై స్పందించారు. ఎవరితోనూ తనకు గొడవలు లేవన్నారు. దీంతో ఇరువురి మధ్య తలెత్తిన సమస్య పరిష్కారం అయినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు రారా... పోరా అనుకున్న అత్యంత సన్నిహిత మిత్రులు లీగల్‌ నోటీసులు, పాటలపై హక్కుల వరకూ వెళ్లారు. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.

కొద్ది నెలల క్రితం ఇళయరాజా కంపోజిషన్‌లో తాను పాడిన పాటలను స్టేజ్ షోలలో పాడలేనని  బాలసుబ్రహ్మణ్యం ఓ లేఖ విడుదల చేశారు. ఇళయరాజా నుంచి తనకు లీగల్ నోటీసులు అందాయని, రాజా కంపోజ్ చేసిన పాటలను ఆయన అనుమతి లేకుండా పాడటానికి వీళ్లేదని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. తనతోపాటు ప్రముఖ గాయని చిత్ర, కుమారుడు చరణ్‌కి కూడా ఇళయరాజా నోటీసులు పంపారని పేర్కొన్నారు. కాబట్టి ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు ప్రదర్శనలలో ఆలపిస్తే పెద్ద మొత్తంలో జరిమానా, చట్టపరమైన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే పాడడం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమలో కలకలం రేగింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరి మధ్య ఏం జరిగిందా అని  అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. 

ఇళయరాజా వర్సెస్ బాలు వివాదంతో సినీసంగీత ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు ఇళయరాజాను సమర్దిస్తే.. మరికొందరు బాలుకు అండగా నిలిచారు. బహిరంగంగా ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. తాజాగా ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వివాదం సమసిపోయిందా అన్నట్టు ఉన్నాయి. అదే నిజమైతే మళ్లీ స్నేహితులు కలిసి ఒకే స్టేజిపై కనిపించి సందడి చేసే అవకాశం ఉంది. ఇది సంగీత ప్రియులకు ఆనందంగా పంచే వార్త అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com