జీఎస్‌టీ కీలకం అంటున్న గుజరాత్

- November 07, 2017 , by Maagulf
జీఎస్‌టీ కీలకం అంటున్న గుజరాత్

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జీఎస్‌టీ అంశం చుట్టూనే పార్టీల రాజకీయం పరిభ్రమిస్తోంది. గుజరాత్‌లో ప్రాబల్య బనియా వ్యాపారులు, పెద్దసంఖ్యలో చిన్న,మధ్యతరహా వ్యాపారాలుండటంతో జీఎస్‌టీ ప్రధాన ఎన్నికల అంశంగా ముందుకొచ్చింది.జీఎస్‌టీతో వ్యాపారాలు దెబ్బతినడంతో ఈ అవకాశం అందిపుచ్చుకుని గుజరాత్‌లో పాగా వేయాలని దశాబ్ధాలుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.మరోవైపు జీఎస్‌టీతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

గుజరాతీ వ్యాపారులను ప్రసన్నం చేసుకునేందుకు పలు వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్‌టీ పన్ను రేట్లను కేంద్రం తగ్గించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు జీఎస్‌టీనే టార్గెట్‌ చేసుకుని మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. జీఎస్‌టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించారు. అయితే టూజీ, బొగ్గు స్కామ్‌లకు చోటిచ్చిన వారికి న్యాయమైన పన్ను వ్యవస్థపై అభ్యంతరాలున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కాంగ్రెస్‌ యువనేతకు కౌంటర్‌లు ఇచ్చారు.

గుజరాత్‌ వస్త్ర పరిశ్రమకు ఊతం ఇచ్చేలా నూలు, ఫిలమెంట్లు వంటి పలు ముడిసరుకులపై జీఎస్‌టీ రేట్లను గణనీయంగా తగ్గించి ఓటర్లను ఆకట్టుకునేందుకు మోదీ సర్కార్‌ ప్రయత్నించింది. జీఎస్‌టీనే తమ గెలుపుకు మలుపుగా భావిస్తున్న కాంగ్రెస్‌ మాత్రం ఈ అంశాన్ని హైలైట్‌ చేసేందుకే మొగ్గుచూపింది. నోట్ల రద్దు ఏడాది పూర్తవుతున్న క్రమంలో ఈనెల 8న రాహుల్‌ చిన్న వ్యాపారులతో సమావేశం కానున్నారు.జీఎస్‌టీ కష్టాలను సమర్ధవంతంగా ఎత్తిచూపేందుకు ఏ చిన్న అవకాశాన్ని కాంగ్రెస్‌ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com