గ్లోబల్ సమ్మిట్ కోసం ముస్తాబవుతున్న నగరం

- November 12, 2017 , by Maagulf
గ్లోబల్ సమ్మిట్ కోసం ముస్తాబవుతున్న నగరం

నిన్నమొన్నటి దాకా తిరిగిన రోడ్లే.. కానీ కొత్తగా కనిపిస్తున్నాయి. సరికొత్తగా మారిపోయాయి. పచ్చదనం లేకుండా.. పొల్యూషన్ కారణంగా పొగబట్టిన డివైడర్లు రంగులతో మెరిసిపోతున్నాయి. పూలవనాలుగా మారిపోతున్నాయి. అందమైన ఆకృతులతో కూడిన బొమ్మలు పలకరిస్తున్నాయి. ఇంతకీ ఏమిటా మార్పు అనుకుంటున్నారా... అదే GHMC లో G.E.S తీసుకొచ్చిన మార్పు.

గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు తొలిసారిగా వేదిక అయిన భాగ్యనగరం మెరిసిపోతోంది. పురాతన చరిత్రకు ఆనవాలు అయిన ఫలక్ నుమా నుంచి ఆధునిక జీవితానికి అద్దం పట్టే హైటెక్ సిటీ వరకూ సరికొత్త శోభను సంతరించుకుంటోంది. ప్రపంచవ్యాపార దిగ్గజాలకు స్వాగతం పలకడానికి ఉవ్విళ్లూరుతోంది.

ఈ నెల 28 నుంచి హైటెక్స్ లో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరగనుంది.. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణను ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ఏర్పాట్లపై ఏమాత్రం రాజీపడనంటోంది. ఇక అతిథులకు ఘనంగా స్వాగతం పలికేందుకు జీహెచ్ఎంసీ సకల సదుపాయాలు సిద్దం చేస్తోంది. నగరంలో బ్యుటిఫికేషన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే నగరంలో హైటెక్ సిటీ రూపురేఖలు మారాయి. ఇటీవల వరకు వర్షాలతో గుంతులమయంగా మారిన నగర రోడ్లు ఇప్పుడు అద్దాల్లా మారిపోయాయి. సరికొత్త హంగులతో ఆకట్టుకునేలా రూపదిద్దుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా పూలమొక్కలను పెట్టారు.. ఏమాత్రం ఖాళీ స్థలం కనిపించినా పచ్చికబయళ్లతో నింపుతున్నారు. వాటిపై ఉంచిన ఎకో కుర్చీలు, బెంచీలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.

డివైడర్లు ఎన్నడూ లేనంత అందంగా రంగుల్లో మెరుస్తున్నాయి. ఆకట్టుకునే ఆకృతులతో కూడిన బొమ్మలను రోడ్ల పక్కన పేరుస్తున్నారు. కళాత్మకతతో కనివిందు చేస్తున్నాయి. ఆక్రమణలతో నిండిన ఫుట్ పాత్ లను ఖాళీ చేయించి.. విశాలంగా మార్చేశారు. ఒక్క మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోనే 20 కోట్లతో పనులు చేపట్టారు అధికారులు.. నిన్నమొన్నటి దాకా అడ్డదిడ్డంగా.. గజిబిజిగా కనిపించిన రహదారులు.. డివైడర్లు ఇప్పుడు ఆహ్లాదంగా మారాయి. అతిథులు పాల్గొనే వేదిక నుంచి బసచేసే హోటల్స్.. పర్యటించే ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తి చేసిన అధికారులు.. నవంబర్ 20 నాటికి వంద శాతం పూర్తి చేస్తామంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com