నేలమట్టమైన భవనాలు..కుప్పలుగా శవాలు ఇరాన్ లో .. 400 మంది మృతి

- November 13, 2017 , by Maagulf
నేలమట్టమైన భవనాలు..కుప్పలుగా శవాలు ఇరాన్ లో .. 400 మంది మృతి

 ఇరాన్ మరుభూమిగా మారింది. శక్తిమంతమైన భూకంపానికి కకావికలమైంది. ఇరాన్‌, ఇరాక్‌  సరిహద్దుల్లో వచ్చిన పెను ప్రకంపనలతో 400 మందికిపైగా బలయ్యారు. ఏడు వేల మందికిపైగా గాయపడ్డారు. శిథిలాలు తొలగించే కొద్ది శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రజలు నిద్రలో ఉన్న వేళ ఈ విపత్తు చోటుచేసుకోవడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు దేశాల సరిహద్దులోని వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఎత్తైన అపార్ట్‌మెంట్లు పేకమేడలా కూలిపోయాయి. 

భూకంపం ప్రభావం ఇరాన్‌లోని 14 ప్రావిన్స్‌ల్లో కనిపించింది. పర్వతమయంగా ఉండే పశ్చిమ కెర్మాన్‌షా లో ఎక్కువ నష్టం కనిపించింది. ఈ ప్రావిన్స్‌లోని సార్పోల్‌ ఎ జహాబ్‌ పట్టణంలో ఎక్కువ నష్టం జరిగింది. ఈ పట్టణంలో విద్యుత్‌, నీరు సరఫరా నిలిచిపోయింది. టెలిఫోన్‌, సెల్‌ఫోన్‌ సేవలు బంద్ అయ్యాయి. ఇక ఇరాక్‌లో ఉత్తర కుర్దిష్‌ ప్రాంతంలో ఏడుగురు చనిపోయారు. 535 మంది గాయపడ్డారు. ప్రకంపనల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించింది. భవనాలు కంపించిపోయాయి. భూకంప బాధితుల కోసం టర్కీ.. సైనిక విమానాల్లో భారీగా సహాయ సామాగ్రిని పంపింది. ఇరాన్‌ కోరితే సాయం అందిస్తామని ప్రకటించింది. 

భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రధాన ‘ఫాల్ట్‌ లైన్‌’లపై ఇరాన్‌ ఉంది. 2003లో6.6 తీవ్రతతో వచ్చిన పెను ప్రకంపన వల్ల చరిత్రాత్మక బామ్‌ నగరం దాదాపుగా నేలమట్టమైంది. దాదాపు 26వేల మంది చనిపోయారు. చివరిసారిగా 2012లో ఇరాన్‌ను పెను భూకంపం తాకింది. 300 మందికిపైగా బలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com