పాక్‌లో అల్లర్లు

- November 26, 2017 , by Maagulf
పాక్‌లో అల్లర్లు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఎన్నికల చట్టం-2017లో 'ఖత్మీ నబువత్‌' ప్రతిజ్ఞకు మార్పులు చేసినందుకు గాను న్యాయశాఖ మంత్రి జహీద్‌ హమీద్‌ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ రెండువేల మంది అతివాద పార్టీల కార్యకర్తలు మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నారు. శనివారం పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో భద్రతా సిబ్బంది మాత్రం లేరని.. కానీ గాయపడిన వారిలో తొమ్మిది మంది సీనియర్‌ పోలీసులు ఉన్నట్లు ప్రముఖ పత్రిక డాన్‌ వెల్లడించింది.
ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం గాయపడిన రెండొందల మందిలో 95 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనకర పరిస్థితులపై పాక్‌ ప్రధాని అబ్బాసీ, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా సమావేశమై చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
పాక్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా యూఏఈ పర్యటనలో ఉన్న ఆర్మీ చీఫ్‌ బజ్వా వెంటనే వెనక్కి తిరిగి వచ్చారు. అల్లర్లు మరింత వ్యాపించకుండా ఉండేందుకు పాక్‌లోని ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రసారాలను, సామాజిక మాధ్యమాల సేవలను శనివారం నుంచి నిలిపివేశారు. నిబంధనలను వ్యతిరేకించి ప్రసారాలు జరిపితే సదరు ఛానెల్‌ నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పాకిస్థాన్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌(పీబీఏ) హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com