వెజిటబుల్‌ పాపడ్‌ రోల్స్‌

వెజిటబుల్‌ పాపడ్‌ రోల్స్‌

కావలసిన పదార్థాలు: మినప్పప్పు అప్పడాలు - 8, క్యారెట్‌ - ఒకటి, బంగాళదుంప - ఒకటి, ఫ్రెంచ్‌ బీన్స్‌ - ఆరు, క్యాలీఫ్లవర్‌ - వంద గ్రాములు, టొమాటో - ఒకటి, పసుపు - అర చెంచా, కారం - అర చెంచా, కొత్తిమీర - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా. 

తయారుచేయు విధానం: ముందుగా క్యారెట్‌, బంగాళదుంప, ఫ్రెంచ్‌ బీన్స్‌, క్యాలీఫ్లవర్‌లను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఓ పాత్రలో వేసి అందులో కాసింత ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. తరువాత అందులో నీటిని వడబోసి ముక్కలను ఆరబెట్టాలి. ఓ పాత్రలో కాసింత నూనె వేసి టొమాటోను దోరగా వేయించాలి. ఇప్పుడు అందులో ఉడకబెట్టిన కూరగాయ ముక్కలను వేసి మరికొంతసేపు వేయించాలి. అందులో పసుపు, కారం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి పొయ్యిమీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. అప్పడాలను ముందుగా కాసేపు నీటిలో ముంచి తీయాలి. దీనివల్ల అవి విరిగిపోకుండా ఉంటాయి. మెత్తబడిన అప్పడం మధ్యలో సిద్ధంగా ఉన్న కూరగాయల మిశ్రమాన్ని వేసి దోశలాగా చుట్టుకొని చివర్లు మూసివేయాలి. ఓ బాణలిలో తగినంత నూనె వేసి అది బాగా వేడెక్కాక అప్పడాలు వేసి దోరగా వేయించాలి. అంతే- వెజిటబుల్‌ పాపడ్‌ రోల్స్‌ రెడీ! వీటిని వేడిగా ఉన్నప్పుడే తింటే మరింత రుచిగా ఉంటాయి.

Back to Top