కల్వరి సబ్ మెరైన్ ను జాతికి అంకితం చేసిన మోడీ
- December 13, 2017

ముంబై : దాదాపు 17 ఏళ్ల నౌకాదళ కల నెరవేరింది. మేడిన్ ఇండియా స్కార్పియన్ జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కల్వరి నేవీలో గురువారం భాగమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్ కల్వరిని నౌకాదళానికి అప్పగిస్తూ జాతికి అంకితం చేశారు. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ సహకారంతో ఐఎన్‌ఎస్ కల్వరి నిర్మాణం జరిగింది. హిందూ మహా సముద్రంలో ఇష్టానుసారం తిరుగుతున్న చైనా యుద్ధనౌకలకు దీనితో చెక్ పెట్టొచ్చు.
ఐఎన్‌ఎస్ కల్వరీని స్కార్పియన్ తరగతికి చెందిన జలాంతర్గామిని జాతికి అంకితం చేయడం అనేది మేకిన్ ఇండియా పథకానికి అతి పెద్ద బలాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ డీజిల్-ఎలక్ట్రికల్ సబ్‌మెరైన్‌ను ముంబైలోని మాజగాన్ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. ఆరు సబ్ మెరైన్ల నిర్మాణంలో భాగంగా మొదటి జలాంతర్గామిని ప్రభుత్వం నేవీకి అప్పగించింది. కల్వరీ సబ్ మెరైన్ పరీక్ష దశలో 120 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించింది. ఫ్రాన్స్ నావల్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ కంపెనీ డిజైన్ ఆధారంగా కల్వరీ నిర్మాణం జరిగింది.
ఐఎన్‌ఎస్ కల్వరీని జాతికి అంకితం చేస్తూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక నిదర్శనం అని ప్రధాని మోదీ చెప్పారు. 1.566 టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ టైగర్ షార్క్ తరహాలో హిందూ మహాసముద్రంలో డీప్ సీ ప్రెడేటర్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేయనుందన్నారు. సముద్ర మార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, అక్రమ చేపల వేటను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో భారత్ మరింత కీలక భూమిక పోషించనుందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. భారత్ 1980, 1990లలో రష్యా, జర్మనీల నుంచి జలాంతర్గాములను నౌకాదళం సమకూర్చుకుంది. జర్మన్ సబ్‌మెరైన్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు రావడంతో తరువాత ప్రభుత్వాలు వీటి కొనుగోలుకు వెనకడుగు వేశాయి. చివరిసారిగా 2000 సంవత్సరంలో ‘ఐఎన్‌ఎస్ సింధురాష్ట్ర’ అనే సంప్రదాయ జలాంతర్గామి భారత నౌకాదళంలో చేరింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారత నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, భారత నావికాదళ సీనియర్ అధికారులు, ఫ్రాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







