ఇక చిన్నమ్మదే హవా!!
- December 24, 2017
దెబ్బల మీద దెబ్బలు తగులుతున్న వేళ.. నిరాశ.. నిస్పృహలు అలుముకున్న వేళ.. ఆశాదీపంలా ప్రజలు వెన్నంట ఉన్నారన్న విషయం అర్థమైతే.. నాయకులకు అదే కొండంత అండగా మారుతుంది. అప్పటివరకూ వారిలో ఉన్న నిరాశ.. నిస్పృహలు పటాపంచలు కావటమే కాదు.. కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళనాట శశికళ వర్గం పరిస్థితి ఇంచుమించు ఇదే తీరులో ఉందని చెప్పాలి.
అమ్మ మరణం తర్వాత బాగానే ఉన్నా.. ఎప్పుడైతే సీఎం కుర్చీలో కూర్చోవటానికి శశికళ రంగం సిద్ధం చేసుకున్నారో అప్పటి నుంచి పరిస్థితులు.. పరిణామాలు వేగంగా మారిపోయాయి. అప్పటి నుంచి చిన్నమ్మ బ్యాచ్‌కు తగులుతున్న దెబ్బలు అన్నిఇన్ని కావు. ఇలాంటి వేళ.. జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఆమెకు.. ఆమె వర్గానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది.
ఈ రోజు ఉదయం మొదలైన ఉప ఎన్నిక ఓట్లు లెక్కింపు వివరాలు బయటకు వస్తున్న కొద్దీ చిన్నమ్మ వర్గం ఆనందానికి అంతు లేకుండా పోయింది. తీవ్ర పోటీ నడుమ.. చిన్నమ్మ వర్గానికి చెందిన దినకరన్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళుతున్నారు. రెండాకుల గుర్తు చేజారి.. కొత్తగా ఇచ్చిన ప్రెషర్ కుక్కర్ గుర్తుతో బరిలోకి దిగిన దినకరన్‌కు ఆర్కే నగర్ ప్రజలు భారీగా ఓట్లు వేశారు. ఇప్పటివరకూ అందుతున్న సమచారం ప్రకారం దినకరన్‌కు 20,298 ఓట్లు వస్తే.. అందులో సగం ఓట్లు కూడా అన్నాడీఎంకే అభ్యర్థికి రాలేదు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కూడా ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు రావటం పోవటం ఒక ఎత్తు అయితే.. బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే.. నోరు వెళ్లబెట్టాల్సిందే.
ఆర్కే నగర్ ఉప ఎన్నికల అంతిమ విజేత తానేనన్న విషయంపై నమ్మకం కుదిరిన వేళ.. దినకరన్ మీడియాతో మాట్లాడారు. తమకు ఎంజీఆర్.. అమ్మ ఆశీస్సులు ఉన్నాయన్నారు. మధురై ఎయిర్ పోర్ట్ దగ్గర మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న మూడు నెలల్లో పళనిస్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమన్నారు.
ఆర్కే నగర్ తీర్పు తమిళనాడు ప్రజల తీర్పుగా అభివర్ణించారు. ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని..బరిలో నిలిచే వ్యక్తి ముఖ్యమన్నారు. చెన్నైకి చేరుకొని అమ్మ సమాధికి నివాళులు అర్పించనున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడుతున్న ఫలితాలతో శశికళ వర్గానికి చెందిన నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







