సింగరేణి చిన్నోడు.. 'ఏక్‌' సినిమా దర్శకుడు

- December 26, 2017 , by Maagulf
సింగరేణి చిన్నోడు.. 'ఏక్‌' సినిమా దర్శకుడు

సినీరంగంలో సంపత్‌ ప్రస్థానం 'కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకొనేందుకు కృషి చేయాలి' అని అబ్దుల్‌కలాం యువతకు సూచించిన మాటలను నిజం చేశారు సింగరేణి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు. సినిమాలకు దర్శకత్వం వహించాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకొని చదువుతోపాటు సినిమా రంగం వైపు ఆలోచనలు చేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా తనపై తనకున్న నమ్మకంతో మాయా ప్రపంచంలో ప్రయత్నాలు ప్రారంభించారు. అసోసియేట్‌ దర్శకుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి చాలా సినిమాలకు పనిచేసిన అతడు 'ఏక్‌' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వర్ధమాన దర్శకుడిగా ఎదుగుతున్న శ్రీరాంపూర్‌కు చెందిన రుద్రారపు సంపత్‌ గురించి 'న్యూస్‌టుడే' కథనం.. శ్రీరాంపూర్‌: కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన రుద్రారపు వెంకటయ్య-లక్ష్మి దంపతుల పెద్దకుమారుడు సంపత్‌. అతనికి తమ్ముడు చిరంజీవి, చెల్లలు రాధ ఉన్నారు. వెంకటయ్యకు 1980లో సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడంతో భార్య, పిల్లలతో శ్రీరాంపూర్‌ ఏరియాకు వచ్చారు. రుద్రారపు సంపత్‌ 7వ తరగతి వరకు ఏరియాలోని శారద శిశుమందిర్‌, పదో తరగతి మంచిర్యాలలోని బాలుర పాఠశాలలో చదివారు. చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో సంపత్‌ చదువుకునే రోజుల్లో తోటి స్నేహితులతో కలిసి సినిమాలు చూస్తుండేవారు. తను చూసిన సినిమా హిట్టైనా, పట్టైనా అందుకు కారణాలను వారితో విశ్లేషించేవారు. ఇంజినీరింగ్‌ చేస్తున్న సమయంలో కొన్ని కథలు రాసి వాటిని స్నేహితులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకొనే వారు. 2001లో బీటెక్‌ పూర్తికాగానే సంపత్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి ఇటు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశం కోసం తన ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నాన్నకు తెలియకుండానే అసోసియేట్‌ దర్శకుడిగా.. 
సినిమా రంగంలోకి వెళ్లేందుకు ముందుగా సంపత్‌ తన తండ్రి అనుమతి అడిగితే అందుకు అతడు ఇంజినీరింగ్‌ చదివి సినిమాల్లోకి వెళ్లడమేమిటని ఒప్పుకోలేదు. దీంతో తండ్రికి తెలియకుండానే సినిమాల్లో తన ప్రయత్నాలను కొనసాగించారు. అలా నాలుగేళ్లు సినిమా దర్శకుడిగా అవకాశం కోసం ప్రయత్నించిన సంపత్‌కు తెలిసిన వాళ్ల ద్వారా 'మంత్ర' సినిమా నిర్మాత రవిప్రకాశ్‌ పరిచయమయ్యారు. ఆయన సంపత్‌ను దర్శకుడు తులసీరాంకు పరిచయం చేయగా అతనికి ఉన్న ఆసక్తిని గమనించి 'మంత్ర' సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. రెండేళ్ల పాటు మంత్ర సినిమాకు పనిచేసిన సంపత్‌కు గీతాకృష్ణ దగ్గర సంవత్సరం పాటు పనిచేసే అవకాశం దొరికింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలు, డాక్యుమెంటరీలకు గీతాకృష్ణ దర్శకత్వం వహిస్తే సంపత్‌ అసోసియేట్‌ దర్శకుడిగా పని చేశారు. తర్వాత పరుచూరి మురళీ దర్శకత్వంతో నితిన్‌, ఇలియానా జంటగా నటించిన 'రెచ్చిపో' సినిమాకు పనిచేశారు. అదే సమయంలో మంత్ర బృందం కొత్త సినిమాను ప్రారంభించి అతనికి అవకాశం ఇచ్చినా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తీవ్ర నిరాశతో కొద్దిరోజులు ఖాళీగానే ఉన్న సంపత్‌ తర్వాత వైవీఎస్‌ చౌదరి దగ్గరికి చేరారు. అప్పుడు సాయిధర్మతేజ్‌తో చౌదరి నిర్మించిన 'రేయ్‌' సినిమాకు పనిచేసే అవకాశం సంపత్‌కు దక్కింది. రేయ్‌ సినిమాకు పనిచేస్తున్న సమయంలోనే సినిమాల్లో అసోసియేట్‌ దర్శకుడిగా పని చేస్తున్నట్లు తండ్రి వెంకటయ్యకు తెలిసింది. కుమారుడికి సినిమా రంగంపై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న సమయంలో సంపత్‌కు ఆర్థిక ఇబ్బందులు రాకుండా తండ్రే అన్ని చూసుకొనే వారు.

'ఏక్‌' సినిమాతో దర్శకుడిగా అవతారం 
రేయ్‌ సినిమా చేస్తున్న సమయంలో సంపత్‌ ఒక కథను సిద్ధం చేసుకొన్నారు. చాలా మంది నిర్మాతలను కలిసి కథ వినిపించినా బాగానే ఉంది అనడం తప్ప నిర్మించేందుకు ముందుకు రాలేదు. దీంతో చాలా నిరాశకు గురైన సంపత్‌ తన కథను తెరకెక్కించే అవకాశం వస్తుందో.. రాదో అని తీవ్రంగా అలోచించేవారు. అనుకోకుండా ఇంజినీరింగ్‌లో స్నేహితుడైన వరంగల్‌కు చెందిన హరికృష్ణ తారసపడ్డారు. సంపత్‌ తయారుచేసిన కథ విన్న తర్వాత హరికృష్ణ దాన్ని సినిమా తీసేందుకు అంగీకరించారు. అలా సంపత్‌ దర్శకత్వంలో కథానాయకుడు, కథానాయికలుగా బిష్ణుఅధికారి, హిమాన్షికురాణా, అపర్ణశర్మలతో 'ఏక్‌' సినిమా ప్రారంభమైంది. సుమన్‌, పృథ్వీ, బెనర్జి, శ్రవణ్‌ వంటి సీనియర్‌ నటులు ఈ సినిమా కోసం 40 రోజులు పనిచేశారు. ఓ యజ్ఞంలా భావించి మూడేళ్లలో దీన్ని పూర్తి చేశారు సంపత్‌. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో జరగగా ప్రముఖ నటుడు అక్కినేని నాగర్జున పాటల సీడీలను ఆవిష్కరించారు. వచ్చే జనవరి నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం 
సినిమాల్లోకి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఒప్పుకోని తండ్రి కొడుకు ఆసక్తిని గమనించి ఆ తర్వాత అండగా నిలిచారు. ఓ సినిమాకు పని చేస్తున్నప్పుడు పూర్తి ధ్యాస దానిపైనే ఉంచాలని, ఇతర విషయాలను పట్టించుకోవద్దని తల్లిదండ్రులు, సోదరీ సోదరుడు ఇప్పటికీ సంపత్‌ను ప్రోత్సహిస్తున్నారు. 2014లో మహరాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన మంజులను పెళ్లి చేసుకొన్న తర్వాత అతనికి మద్దతు మరింత పెరిగింది. భర్త ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతుండటంతో సంపత్‌పై భారం పడకుండా వారి పిల్లలు ఇషాశ్రీ, నిత్యశ్రీ, కల్యాణ్‌తేజ్‌ బాగోగులు, చదువులను చూసుకుంటున్నారు.

మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాలి 
సినిమా రంగంలో 13 ఏళ్లుగా పనిచేస్తున్నాను. అసోసియేట్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఇక్కడ చాలా మంది పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఏక్‌ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడిగా నా ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు మరిన్ని మంచి అవకాశాలు రావొచ్చు. పెద్ద నటులతో సినిమాలు తీసి మంచి దర్శకుడిగా గుర్తింపు సాధించాలని ఉంది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com