తత్కాల్ పాస్‌పోర్టు.. ఇక మరింత ఈజీ

- January 27, 2018 , by Maagulf
తత్కాల్ పాస్‌పోర్టు.. ఇక మరింత ఈజీ

న్యూఢిల్లీ: తత్కాల్‌ పథకం కింద జారీ చేసే పాస్‌పోర్టులకు ఇకమీదట తిప్పలు పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన నిబంధనలను విదేశాంగ మంత్రిత్వ శాఖ సడలించింది.
ఇప్పటి వరకు సీనియర్‌ గెజిటెడ్‌ అధికారులు సంబంధిత ధ్రువ పత్రాలను పరిశీలించాలనే నిబంధన ఉండేది. అయితే తాజాగా ఈ నిబంధనను ఎత్తివేశారు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా తత్కాల్‌ పాస్‌పోర్టులను ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ విధానం 2018 జనవరి 25 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, తత్కాల్‌ పాస్‌పోర్టును దరఖాస్తు సమర్పించిన మూడు పనిదినాల్లో మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
తత్కాల్‌ పథకంలో పాస్‌పోర్టు పొందేందుకు ఇప్పటి వరకు దరఖాస్తుదారుని ధ్రువపత్రాలను పరిశీలించి.. క్లాస్‌-1 గెజిటెడ్‌ అధికారి సిఫారసు చేయాలనే నిబంధన ఉంది. మారిన నిబంధనల మేరకు దరఖాస్తు దారుడు తన ఆధార్‌ను చూపించి తత్కాల్‌ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పట్టణాలు, నగరాలకు దూరంగా నివసించేవారు ఆన్‌లైన్‌ ద్వారా టైం స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇప్పటి వరకు 'ఎవరు ముందొస్తే వారికి' విధానంలో రోజుకు 180 మందికే టైం స్లాట్‌ ఇస్తున్నారు.
దీనిని ఇక నుంచి 250 స్లాట్లకు పెంచారు. ఇక, 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు మాత్రం పాస్‌పోర్టు పొందేందుకు ఆధార్‌తోపాటు విద్యార్థి ఫొటో గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com