"నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా"- రివ్యూ
- May 03, 2018ఇక్కడ దుబాయి లో నివసించే అందరు భారతీయుల పేర్లు సూర్య కాకపోయినా, అందరి ఇల్లు మాత్రం ఇండియానే. అలా ఈ టైటిల్లో సగభాగం ప్రతి ప్రవాస భారతీయుడికి వర్తిస్తుంది. ఈ సినిమా ట్రైలర్స్ చూసినప్పటి నుంచి బన్నీ సినిమా కావడం, పైగా ఇది దేశభక్తికి సంబంధించిన సినిమా అన్నట్టుగా ప్రొమోట్ చేయడంతో కొంచెం కొత్తదనం కలగలిసి ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఉత్సాహం ఇక్కడ చాలామందికి కలిగింది.
ముక్కుమీద కోపం, కండల్లో బలం, గుండెల్లో ధైర్యం, మూర్ఖమైన దేశభక్తి -ఇవీ సూర్య (అల్లు అర్జున్) లక్షణాలు. ఇతనొక సైనికుడు. సైనికుడంటే ఏ విధమైన కమీషన్ ర్యాంక్ లేని అచ్చమైన ఎంట్రీ లెవిల్ సైనికుడు. అతను ఉన్న గ్యారిసన్ లో ఒక నిర్ణయాధికారి (బొమన్ ఇరాని) సూర్య కోపం పట్ల చాలా అసహనంగా ఉంటాడు. తప్పు చేసిన ఒక పోలీసాఫీసర్ని చావగొట్టడం, బందీగా ఉన్న ఒక టెర్రరిస్టుని ఏ మాత్రం సహనం చూపకుండా కాల్చిపారేయడం వంటి పనులు చేసినందుకు సూర్యపై డిస్మిస్ వేటు వేస్తాడు. సూర్య తండ్రి (రావు రమేష్) ఆ అధికారిని వేడుకుంటాడు. సూర్యని ఎందుకు ఆర్మీలో ఉంచాలో ఒక బలమైన కారణం చెబితే లాస్ట్ చాన్స్ కింద క్షమించే ప్రయత్నం చేస్తాను అంటాడు ఆ అధికారి. అతను చెప్పిన నాలుగైదు కారణాల్లో ఒక కారణం నచ్చడంతో డిస్మిసల్ ను వెనక్కి తీసుకుంటాడు... కానీ ఒక షరతు మీద. ఆ షరతు ఏమిటంటే, తాను చెప్పిన ఒక పేరు మోసిన సైకాలజిస్ట్ (అర్జున్ సర్జా) నుంచి సూర్య కండక్ట్ సర్టిఫికేట్ మీద సంతకం చేయించుకుని తీసుకురావడం. అదెంతపని అన్నట్టుగా సూర్య బయలుదేరతాడు. కానీ అక్కడి నుంచి కథ ఎటు తిరుగుతుంది? సూర్యకి, ఆ సైకాలీజిస్టుకి గతంలో ఉన్న లింకేంటి వంటి విషయాలు తెరమీద చూడాలి.
కథ మొత్తం సూర్య చుట్టూ నడుస్తుంది. సూర్య పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు. అంత సీరియస్ పాత్రలోనూ ఒక సహజమైన హ్యూమర్ని కూడా పండించాడు. హీరోయిన్ గా అను ఇమాన్యువల్ చూడ్డానికి చాలా బాగుంది, పాటల్లో గ్లామర్ డోసుతో పాటు పర్ఫార్మ్ చెయ్యడానికి రెండు మూడు సెంటిమెంటల్ సన్నివేశాలు దొరికాయి. ఏది ఏమైనా సినిమా పూర్తయ్యాక అల్లు అర్జున్ గుర్తున్నంతగా హీరోయిన్ పాత్ర గుర్తుండదు. ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ రెండో ముఖ్యమైన పాత్ర అర్జున్ సర్జాది. ఆ పాత్రకు అతనే సరిపోతాడనిపించేలా ఉన్నాడు. సీరియస్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఒదిగిపోయాడు. బొమన్ ఇరాని, రావు రమేష్, శరత్ కుమార్, ప్రదీప్ రావత్, సాయికుమార్ ఓకే. ఇండియా మీద అయిష్టతను పెంచుకున్న యువకుడి పాత్రలో విక్రం న్యాయం చేసాడు. పోసాని, వెన్నెల కిషోర్ లు ఎక్కడా ఓవర్ డోస్ అవకుండా సన్నివేశ ప్రధానమైన హాస్యాన్ని పండించారు.
"ఇండియా అంటే ఈస్ట్ , వెస్ట్, నార్త్, సౌత్ అంటూ అన్ని రకాలు ఉండవు, ఉన్నది ఒకటే ఇండియా" అనే డయలాగ్ అందరికీ కనెక్ట్ అయ్యి, అందర్నీ కనెక్ట్ చేసేలా ఉంది.
"క్యారెక్టర్ వదిలేస్తే నిజమైన చావు రావడానికంటే ముందే చచ్చిపోవడం లాంటిది" అనే డయలాగ్ హత్తుకుంటుంది.
అలాగే యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్న సాయికుమార్ పాత్ర చెప్పే డయలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.
మొత్తమ్మీద ఒక ఆరితేరిన డయలాగ్ రైటర్ డైరక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ సినిమా.
అయితే ఇది వక్కంతం వంశీకి దర్శకుడిగా తొలి సినిమా అంటే నమ్మడం కష్టం. అంత పకడ్బందీగా సాగింది కథనం.
బన్నీ సినిమా అనగానే అతను చేసే కొంటె చేష్టలతో కూడిన రేసుగుర్రం లాంటి కామెడీని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ల విషయం ఏమో గానీ, అసలు ఈ కథకి బన్నీ తప్ప ఇంకెవరూ సెట్ అవ్వరు అనిపించింది.
ఎలా చూసినా ఈ సినిమా చూడదగ్గ సినిమాయే కాదు, చూడాల్సిన సినిమా కూడా. అన్ని కమెర్షియల్ సినిమాల్లోనూ ఉండే విలువలు, వినోదంతో పాటు వేరే ఏ విధమైన నెగటివిటి లేకుండా కాస్తంత దేశభక్తిని, బాధ్యతని గుండెల్లో పెట్టి పంపించే పాజిటివ్ సినిమా ఇది. స్టార్లు ఇలాంటి సినిమాలు చెయ్యాలి. అమ్మాయిల్ని టీజింగ్ చేయడమో, లేపుకుపోయి పెళ్ళి చేసుకోవడమో, గురువుల్ని వెక్కిరించడమో లాంటి రుగ్మతల్ని హీరోయిజంగా చూపించకుండా ఇలా ఎంతో కొంత దేశభక్తినో, బాధ్యతనో కమెర్షియల్ అంశాలు జోడిస్తూనే తమదైన శైలిలో జనం ముందు ఉంచాలి. అప్పుడే స్టార్ హీరోలు నిజమైన హీరోలుగా గుర్తుంటారు.. ఈ సినిమా వరకు బన్నీకి థాంక్స్ చెప్పాలి.
మాగల్ఫ్ రేటింగ్: 4/5
- శ్రీకాంత్ చిత్తర్వు
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!