టర్కీ లో ఎన్నికలు ఎర్డోగన్ గెలుపు..
- June 25, 2018
టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ నేత రిసెప్ తయ్యిప్ ఎర్డొగన్ ఘన విజయం సాధించారు. దీంతో, ఆయన మరోసారి దేశాధ్యక్షుడయ్యే అవకాశం దక్కించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పార్లమెంట్, అధ్యక్ష ఎన్నికల్లో 5కోట్ల 60లక్షల మంది ఓటర్లు పాల్గొని వారి ఓట్లను నమోదు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ముగిసింది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులోనే ఎర్డొగన్ భారీ విజయం నమోదు చేశారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 99 శాతం పూర్తయిందన్నారు. తాము లెక్కించిన ఓట్లలో 53శాతం ఓట్లు ఎర్డోగన్‌కు వచ్చాయని అన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి ముహర్రమ్ ఇన్స్‌కు 31 శాతం ఓట్లు లభించాయని వివరించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగన్ గెలుపొందిన సందర్భంగా ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు అంకారా వీధుల్లో సంబురాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాతో వీధుల్లో సంచరిస్తూ ఎర్డోగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. టర్కీలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎర్డొగన్ మాట్లాడుతూ.. ''తాజా విజయంతో.. ప్రజాస్వామ్యం విషయంలో టర్కీ ప్రపంచానికీ ఓ పాఠం నేర్పింది'' అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 50 శాతానికి మించి ఓట్లు లభిస్తే విజయం సాధించినట్లే. తద్వారా రెండోదశ ఓటింగ్ అవసరం ఉండదు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎర్డొగన్ నాయకత్వం వహిస్తున్న ఏకే పార్టీయే ముందంజలో ఉంది. ఎన్నికల్లో మొత్తం 87 శాతం పోలింగ్ నమోదైంది. 2016 జూలైలో జరిగిన సైనిక తిరుగుబాటు విఫలమైన తర్వాత టర్కీలో ఎమర్జెన్సీ విధించారు. వాస్తవానికి ఈ ఎన్నికలు 2019 నవంబర్‌లో జరగాల్సి ఉండగా, వీటిని ఎర్డొగన్ ముందుకు జరిపారు. 2014లో అధ్యక్ష పదవి చేపట్టక ముందు 11 సంవత్సరాల పాటు ఎర్డొగన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు.
ఎన్నికల్లో ఎర్డోగన్ గెలుపొందిన తర్వాత ఆయన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేత ముహర్రమ్ ఇన్స్ స్థానిక మీడియాతో మాట్లాడారు. తాను ఓటమిని అంగీకరిస్తున్నానని అన్నారు. టర్కీ పౌరుల ఆకాంక్షలను ఎర్డోగన్ నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎర్డోగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
శక్తివంతమైన నేతగా నిలిచిపోయిన ఎర్డోగన్
ప్రస్తుత దేశాధ్యక్షుడు ఎర్డొగన్‌కు మరో ఐదేండ్ల పాటు అధికారం దక్కుతుందా లేదా అని తేల్చే కీలక ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఈ ఎన్నికల్లో ఎర్డోగన్ ఘన విజయం సాధించారు. ఎర్డోగన్ తన పదవీకాలంలో శక్తివంతమైన నేతగా ఎదుగుతారని కొందరు సమర్థిస్తుండగా...ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తారని మరికొందరు విమర్శిస్తున్నారు. 'టర్కీ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఎర్డొగన్ కూడా ఇంత గట్టి పోటీని ఎప్పుడూ ఎదుర్కోలేదు' అంటూ పలు మీడియా సంస్థలు ఎర్డోగన్ గెలుపుపై కామెంట్లు పెట్టాయి. టర్కీ పితామహాడు అటాటర్క్ కంటే శక్తివంతుడైన టర్కీ నేతగా ఎర్డోగన్ చరిత్రపుటల్లో నిలిచిపోతారని మరికొందరు దేశాధ్యక్షుడిని ప్రశంసలతో ముంచెత్తారు.
ఎవరీ ఎర్డొగన్?
తాను అధికారంలో ఉన్న గత 15 ఏండ్ల కాలంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎర్డొగన్ గెలుపొందారు. అయితే, ఈ కాలంలోనే టర్కీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విపక్షాల ప్రచారం కూడా చాలా గట్టిగా ఉంది. నవీన టర్కీ చరిత్రలో మరే నాయకుడూ చేయనం తగా దేశాన్ని తీర్చిదిద్దారు ఇస్లామిక్ మూలాలున్న ఏకే పార్టీ బలపరుస్తున్న ఎర్డొగన్. రెండుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వాస్తవానికి అధ్యక్ష పదవి అనేది అలంకారప్రాయమైనదే. కానీ, గతేడాది ఏప్రిల్‌లో టర్కీ ఓటర్లు నూతన రాజ్యాంగానికి మద్దతు పలికారు. దీని ప్రకారం అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు సంక్రమించాయి.
పార్లమెంటుతో కలిపి జమిలి ఎన్నికలు
ఆదివారం అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. రెండింటినీ కలిపి ఒకేసారి నిర్వహిం చారు. 600 సీట్లున్న పార్లమెంటులో కూడా అధికారం చేపట్టాలని ఏకే పార్టీ భావిస్తోంది. అయితే, ప్రతిపక్షాలన్నీ కలసి ఏర్పాటు చేసిన కూటమి గట్టి పోటీ ఇస్తోంది.
పుతిన్ శుభాకాంక్షలు..
అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎర్డోగన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. టర్కీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సామర్థ్యం ఎర్డోగన్లో ఉందని ప్రశంసిం చారు. ఎర్డోగన్‌తో కలిసి పనిచేయడమే కాకుండా బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిం చుకుంటామని పుతిన్ పునరుద్ఘాటించారు.
హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్, అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్, అల్బేనియా ప్రధాని ఎదిరమా, సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియేవ్ తదితరులు ఎర్డోగన్‌కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు నమోదయ్యాయంటే...
పీపుల్స్ అలియన్స్
(ఏకే పార్టీ -ఎంహెచ్పీ ) : 53.84శాతం ఓట్లు
నేషనల్ అలియన్స్
(సీహెచ్‌పీ-ఐవైఐ పార్టీ-ఎస్పీ) : 34.03శాతం ఓట్లు
హెచ్‌డీపీ : 11.05 శాతం ఓట్లు
అధ్యక్ష అభ్యర్థి పేరు నమోదైన ఓట్ల శాతం
రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ 52.83
ముహర్రెమ్ ఇన్స్ 30.68
సెలహట్టిన్ డెమిర్టాస్ 7.96
మెరల్ అక్సెనర 7.44
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!