అమెరికా కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టనున్న తెలుగు మహిళ

- June 26, 2018 , by Maagulf
అమెరికా కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టనున్న తెలుగు మహిళ

ప్రతిష్ఠాత్మక అమెరికా కాంగ్రెస్ కు తెలుగు మహిళ అరుణ మిల్లర్‌ పోటీ చేస్తున్నారు. 53 ఏళ్ల వయసున్న ఆమె ప్రస్తుతం మేరీల్యాండ్‌ ప్రతినిధుల సభలో సభ్యురాలు. మేరీల్యాండ్‌ నుంచి అరుణా మిల్లర్ అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికయ్యేందుకు అవకాశాలు మెరుగవుతున్నాయి. జూన్‌ 26న ఎన్నిక జరగనుంది. డెమొక్రాట్‌లోని తన ప్రత్యర్థిపై గెలిస్తే మలిదశలో విజయం నల్లేరుపై నడకే అంటున్నారు. సివిల్‌ ఇంజనీర్‌ అయిన అరుణ అభ్యర్థిత్వానికి 314-యాక్షన్‌ అనే రాజకీయ కార్యాచరణ కమిటీ, సహా పలు తెలుగు, అమెరికన్ సంఘాలు మద్దతు తెలిపాయి. అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టారు. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా. ఐబీఎంలో ఉద్యోగం రావడంతో మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు పిల్లలను తీసుకుని 1972లోనే అమెరికా వెళ్లి అక్కడే సెటిలైపోయారు. అప్పుడు అరుణ వయసు ఏడేళ్లు. 

మేరీల్యాండ్‌ లోని డెమొక్రాట్ల కంచుకోట అయిన ఆరో జిల్లా ప్రైమరీకి అరుణా మిల్లర్ పోటీలో ఉన్నారు. ఈ సారి డెమొక్రాట్  పార్టీలో ఆమె ప్రత్యర్థి డేవిడ్‌ ట్రోన్‌. ఈయనో సంపన్న వ్యాపారవేత్త. తన గెలుపు కోసం ఆయన దాదాపు 65 కోట్లు ఖర్చు చేశారు. అదంతా ఆయన స్వయంగా ఆర్జించిన సొమ్ము. అరుణ కేవలం 9 కోట్లు ఖర్చుపెట్టారు. అది కూడా విరాళాల రూపంలో సేకరించినదీ, స్నేహితులు సమకూర్చిందే. అరుణ- ట్రోన్‌ల పోటీపై అమెరికా అంతటా విస్తృత చర్చ జరుగుతోంది. ఆమె విజయం దాదాపుగా ఖరారేనని అనేక అమెరికన్‌ పత్రికలు రాస్తున్నా తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

అమెరికాలో అడుగుపెట్టాక అరుణ హైస్కూలు విద్యాభ్యాసమంతా న్యూయార్క్‌లో సాగింది. ఆ తరువాత ముసోరి విశ్వవిద్యాలయంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. 1990లోనే మౌంటెగ్మేరీ కౌంటీలో మేరీల్యాండ్‌ వెళ్లిన ఆమె -కాలేజీలో తాను ప్రేమించిన డేవిడ్‌ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. 2004లో డెమొక్రటిక్‌ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సెర్వింగ్‌ అవర్‌ కమ్యూనిటీస్‌ అనే సంస్థను పెట్టి వివిధ రంగాల్లో వలంటీర్ల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అరుణ గెలిస్తే... ప్రమీలా జయపాల్ తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టే రెండో భారత సంతతి మహిళ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com