బాబు గోగినేనిపై కేసు నమోదు.. ఆధారాలు ఇవ్వలేదన్న సీఐ..

- June 26, 2018 , by Maagulf
బాబు గోగినేనిపై కేసు నమోదు.. ఆధారాలు ఇవ్వలేదన్న సీఐ..
హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్‌ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. సోషల్‌ మీడియాలో ఓ మతాన్ని కించ పరిచేలా మాట్లాడారని కేవీ నారాయణ కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రైవేట్‌ కార్యక్రమానికి ఆధార్‌ నంబర్లను తీసుకోవడం పైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 
బాబు గోగినేని సౌత్‌ ఏషియన్ హ్యూమనిస్ట్‌ పేరుతో ఇటీవల హైదరాబాద్‌, విశాఖ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి ఆధార్‌ నెంబర్లు తీసుకున్నారు. వీటిని మలేషియా కంపెనీకి విక్రయించినట్టు కేవీ నారాయణ ఆరోపించారు. అలాగే సోషల్‌ మీడియాలో సౌదీ ఉగ్రవాద దేశమని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆ దేశానికి, మనకు మధ్య సత్‌ సంబంధాలు దెబ్బతింటాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మత గ్రంథాలను బాబు గోగినేని కించపరిచారని పిటిషనర్ పేర్కోన్నారు. దీంతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో  బాబు గోగినేని పై 13 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఐతే.. తమకు ఫిర్యాదు చేసిన కేవీ నారాయణ ఇంకా పూర్తి ఆధారాలు తమకు ఇవ్వలేదని..  మాదాపూర్‌ పీఎస్‌ సీఐ కళింగరావు  చెప్పారు. ఆధారాలు సమర్పించాక బాబు గోగినేనిపై చర్యలు తీసుకుంటామన్నారు కళింగరావు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com