సంపన్నుడిగా మరో మెట్టు ఎక్కిన జుకర్‌బర్గ్‌

- July 07, 2018 , by Maagulf
సంపన్నుడిగా మరో మెట్టు ఎక్కిన జుకర్‌బర్గ్‌

ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్ ప్రఖ్యాత అమెరికన్‌ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ను అధిగమించేసి ప్రపంచంలోనే మూడో సంపన్నుడిగా మారారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో అమెజాన్‌. కామ్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ ఉండగా, రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ ఉన్నారు. శుక్రవారం ఫేస్‌బుక్‌ షేర్లు 2.4శాతం పెరగడంతో జుకర్‌బర్గ్‌ ఆస్తి పెరిగిపోయి సంపన్నుల జాబితాలో మూడోస్థానానికి చేరారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. సంపన్నుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లోనూ టెక్నాలజీ సంస్థల అధినేతలే ఉండడం ఇదే తొలిసారి అని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. 34ఏళ్ల జుకర్‌బర్గ్‌ ఆస్తి ఇప్పుడు 81.6బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ సీఈఓ బఫెట్‌ కంటే 373మిలియన్‌ డాలర్లు ఎక్కువ అని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌ డేటా లీకేజీపై వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్లుగా ఫేస్‌బుక్‌ షేర్లు నష్టపోయాయి.

మార్చి 27 షేరు విలువ 152.22డాలర్లతో ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయింది. అయితే శుక్రవారం అనూహ్యంగా షేరు విలువ పెరిగిపోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 203.23డాలర్లుగా ఉంది. దీంతో జుకర్‌బర్గ్‌ ఆస్తి కూడా పెరిగింది.

ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక సంపన్న వ్యక్తిగా ఉన్న బఫెట్‌ ఆస్తి తగ్గిపోతూ వస్తోంది. ఎందుకంటే ఆయన పెద్ద మొత్తంలో డబ్బును ఛారిటీలకు అందిస్తున్నారు. 290 మిలియన్‌ డాలర్ల విలువ చేసే బెర్క్‌షైర్‌ హత్‌వే క్లాస్‌ బీ షేర్లను బఫెట్‌ ఛారిటీలకు ఇచ్చారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా తన జీవితకాలంలో తన ఫేస్‌బుక్‌ వాటాలోని 99శాతం షేర్లను ఛారిటీలకు ఇస్తానని గతంలో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com