ఈ రోజే పాక్షిక సూర్యగ్రహణం...

ఈ రోజే పాక్షిక సూర్యగ్రహణం...

భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్న క్రమంలో శనివారం(ఆగస్టు 11న) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత కాలగమనం ప్రకారం మధ్యాహ్నం 1:32 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5.02 వరకూ సూర్యగ్రహణం కొనసాగనుంది. అయితే ఆ సమయంలో భారత్ పై చంద్రుడి నీడ పడకపోవడంతో పాక్షిక గ్రహణాన్ని వీక్షించే అవకాశం మనకు లేదని ప్లానెటరీ సొసైటీ ఇండియా తెలిపింది. ఇది ఉత్తరార్థగోళంలోని ముఖ్య ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది. అటు ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం అని ఈ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం సంభవించే సూర్యగ్రహణ గమనాన్ని గుర్తించేందకు గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో నాసా ఓ మ్యాపును సృష్టించింది. దీని ప్రకారం.. సూర్యగ్రహణం సైబీరియా తూర్పు భాగంతోపాటు ఉత్తర ధ్రువంలో చూసే అవకాశం ఉంది. సూర్య గ్రహణాలను నేరుగా చూడరాదు. గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను నేరుగా చూడటం వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యేక కళ్లజోళ్లతో గ్రహణాన్ని వీక్షించవచ్చు.

కాగా ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు సార్లు గ్రహణాలు ఏర్పడ్డాయి. జనవరి నెలలో 31వ తారీఖున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడింది. అలానే ఫిబ్రవరి నెల 16వ తేదీన, జులై నెల 13వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడగా.. మళ్లీ జులై నెల 27/28న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పాడ్డాయి.

సూర్య గ్రహణం

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది ఆ సమయంలో చంద్రుడి నీడ సూర్యుడిపై పడటం వల్ల చీకటి అలుముకుంటుంది. చంద్రుడి నీడ సూర్యుడిని పూర్తిగా ఆవహించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది.

పాక్షిక సూర్య గ్రహణం: సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాల నుండి కనిపిస్తుంది.

Back to Top