తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- June 02, 2026
సైబరాబాద్: 12వ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జూన్ 2, 2026న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పరేడ్ కమాండర్ నుండి పోలీసు గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు. తదనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భం గా సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ నేడు దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సీపీ తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ పోలీసులు అనేక జాతీయ స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలవడం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిభకు నిదర్శనమన్నారు. ప్రజలకు భద్రత కల్పించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సైబరాబాద్ ఒకటి అని డా.ఎం. రమేష్ తెలిపారు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, తయారీ పరిశ్రమలు, విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు వంటి ప్రాజెక్టులు తెలంగాణను జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి తెలంగాణకు వస్తున్న ప్రజలకు భద్రత, రక్షణను కల్పించడం పోలీసుల బాధ్యత అని పేర్కొంటూ, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని సూచించారు.
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, తలసరి ఆదాయం వంటి కీలక సూచీలలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి ప్రతి తెలంగాణ వాసి గర్వించదగ్గ విషయమని సీపీ అభివర్ణిoచారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే బలిమెల ఘటనలో అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఇంటి స్థలాలను కేటాయించడం పోలీసు కుటుంబాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
అనంతరం విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి మహోన్నత సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలు మరియు సేవా పతకాలను సీపీ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2026 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. మహోన్నత సేవా పతకానికి అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. రవికుమార్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ జి. అశోక్ ఎంపిక కాగా, ఉత్తమ సేవా పతకాలకు ఎస్ఐలు కె. శ్రీనివాస్, ఎస్. రాంబాబు, మహ్మద్ హాజీ మియా, ఏఆర్ఎస్ఐ కృష్ణ నరేడ్ల, ఏఎస్ఐ వి. వెంకట సూర్యనారాయణ రాజు ఎంపికయ్యారు. అదేవిధంగా సేవా పతకాలకు సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన మరో 37 మంది అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అభినందిస్తూ, వారి సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో హైదరాబాద్ జిల్లా మహిళా మండలుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి షహీన్ అఫ్రోజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమానికి చెందిన మొత్తం 28 మంది సభ్యులు (చిన్నారులు, సిబ్బంది) నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి షహీన్ అఫ్రోజ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు సామాజిక పురోగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ఆమె అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించి, రాష్ట్ర ప్రగతి పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సైబరాబాద్ పోలీసుల ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుత్భుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి., అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, శేరిలింగంపల్లి డీసీపీ సి.హెచ్. శ్రీనివాస్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వై.వి.ఎస్. సుధీంద్ర, డబ్ల్యు అండ్ సీఎస్‌డబ్ల్యూ డీసీపీ సృజన కరణం, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్, ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సైబరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







