అమెరికాలో చంద్రబాబు మరో కీలక ఉపన్యాసం

- September 26, 2018 , by Maagulf
అమెరికాలో చంద్రబాబు మరో కీలక ఉపన్యాసం

అమెరికా:అభివృద్ధికి చిరునామాలా మారిన ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద పారుతోంది. అమెరికా టూర్‌లో ఉన్న సీఎం చంద్రబాబు… ప్రముఖ కంపెనీలను నవ్యాంధ్ర బాట పట్టించారు. టెలికాం రంగ దిగ్గజ కంపెనీ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌… ఆతిథ్యం, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. కృత్రిమ మేధస్సు ప్రయోగాలకు రాష్ట్రాన్ని వేదికగా చేసుకోవాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

అమెరికా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. నాలుగో రోజున కొలంబియా యూనివర్సిటీలో సాంకేతిక యుగంలో ప్రజా పాలనపై ఆయన ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్ధికాభివృద్ధి మండలి, ప్రపంచ ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో తన అభిప్రాయాలను చంద్రబాబు వెల్లడించారు.

ఇక.. న్యూయార్క్‌లో ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఆతిధ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని సునీల్ మిట్టల్‌ని చంద్రబాబు కోరారు. గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీ భాగస్వామ్యంతో వివిధ దేశాల్లో ఆతిధ్య రంగ వెంచర్లపై ఇప్పటికే భారతి గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు భారతి గ్లోబల్ ఆసక్తి చూపుతోంది. కాగా.. ఇప్పటికే ఏపీలో ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భాగస్వామ్య సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. మిర్చి, మొక్కజొన్న పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయడం రైతాంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని సునీల్‌మిట్టల్‌తో చంద్రబాబు అన్నారు. డెల్‌మోంటే పసిఫిక్‌ లిమిటెడ్‌పేరుతో భారతి ఎంటర్‌ప్రైజెస్‌ ఫీల్డ్‌ ఫ్రెష్‌ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ నిర్వహిస్తోంది. డెల్‌ మోంటే బ్రాండ్‌ పేరుతో ఆహార, పానీయ ఉత్పత్తులను భారత్‌ సహా సార్క్‌ దేశాల్లో విక్రయిస్తోంది. మొక్కజొన్న, మిర్చి ఎగుమతులను యూకే, పశ్చిమ ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఏపీలో ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్‌, ఫాక్స్‌కాన్‌ గ్రూపులతో కలిసి పునరుత్పాదక ఇంధనోత్పత్తి రంగంపై భారతి గ్రూప్‌ పెట్టుబడులు పెట్టినట్లు ముఖ్యమంత్రి దృష్టికి సునీల్‌మిట్టల్‌ తీసుకువచ్చారు. 350 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఏపీలో అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నందుకు సునీల్‌మిట్టల్‌కు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.. మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

మరోవైపు.. విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీలో డేటా అనలిటిక్స్‌, ఆపరేషనల్‌ రీసెర్చ్‌ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వాట్సన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో సీఎంను కలిసిన వాట్సన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ బిజినెస్‌ హెడల్‌ శామ్‌కల్యాణం… ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌, ఫ్రాండ్‌ రెగ్యులేటరీ కంప్లెయన్స్‌ ఆధారిత ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడతామని చంద్రబాబుకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com