హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ

- January 12, 2019 , by Maagulf
హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ

జర్నలిస్టు రామచంద్ర హత్య కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ పంచకుల సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గుర్మీత్‌తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జగ్దీప్‌ సింగ్‌ తీర్పునిచ్చారు. దోషులకు ఈనెల 17న శిక్షలు ఖరారు చేయనున్నారు.

సిర్సాలోని డేరా సచ్చా సౌదా హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి బయటపెట్టారు. 'పూరా' సచ్ పత్రికలో డేరాబాబా అరాచాకాలపై ఎన్నో కథనాలు వచ్చాయి. 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన ఇంటి ముందే నిందితులు తుపాకీతో కాల్చగా.. మూడు వారాల తర్వాత ఆయన కన్నుమూశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్మీత్‌తో పాటు ఆయన అనుచరులు కుల్దీప్‌సింగ్‌, నిర్మల్‌ సింగ్‌ ఉన్నారు. ఈ కేసును విచారణ జరిపిన కోర్టు బాబాతో పాటూ మరో ముగ్గుర్ని దోషులుగా తేల్చింది.

అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షపడింది. హర్యానాలోని సునారియా జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నారు. అత్యాచారం కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు రావడంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో అల్లర్లు రేగాయి. డేరా బాబా అనుచరులు, అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా చనిపోయారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com