గల్ఫ్ మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం:ఎయిర్ ఇండియా

గల్ఫ్ మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం:ఎయిర్ ఇండియా

ఢిల్లీ: పొట్టకూటి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్న అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను భరించలేక బాధిత కుటుంబాలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. అలాంటి వారి శోకాన్ని అర్థం చేసుకున్న ఎయిర్‌ ఇండియా మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది.

'భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖతో చర్చించాం. భారతీయులు ఎక్కువగా ఉన్న ఆరు గల్ఫ్‌ దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి తక్కువ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణియించాం. సాధారణం కంటే 40శాతం రాయితీ కల్పించనున్నాం' అని ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి సోమవారం తెలిపారు. ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం యూ.ఏ.ఈ  కు రూ.29,000, సౌదీ అరెబియాకు రూ.41,800, కతార్‌కు రూ.43,000, బహ్రెయిన్ కు  రూ.42,500, ఒమన్‌కు రూ.29,500, కువైట్‌కు రూ.40,900 ఛార్జీలు వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ రాయితీలను మరికొన్ని దేశాలకు కూడా వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం భారత్‌ నుంచి దాదాపు 1.7కోట్ల మంది విదేశాలకు వలసవెళ్లారు. వీరిలో 50లక్షల వరకు గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు.

Back to Top