ఖషోగీ హత్యకేసు..16మంది సౌదీలపై అమెరికా నిషేధం

- April 10, 2019 , by Maagulf
ఖషోగీ హత్యకేసు..16మంది సౌదీలపై అమెరికా నిషేధం

వాషింగ్టన్‌ : ఇస్తాంబుల్‌లో జరిగిన సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య కేసులో 16 మంది సౌదీ ప్రముఖులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ సోమవారం ప్రకటించింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సలేట్‌లో గత అక్టోబర్‌ 2న జరిగిన ఈ హత్య ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనితో పాటు సౌదీలో మానవ హక్కుల పరిరక్షణపై అంతర్జాతీయ సమాజం కూడా దృష్టి సారించటం విశేషం. ఈ హత్యకు సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బాధ్యుడని ఆరోపిస్తూ అమెరికా సెనేట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పటికీ, ఆయన విషయంలో ఒక నిర్దిష్ట వైఖరిని తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విముఖత వ్యక్తం చేస్తూనే వున్నారు. సౌదీ అరేబియా తమ దేశం నుండి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకోవటమే కాక, మధ్యప్రాచ్యంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా తమను సమర్థిస్తున్న కారణంగా ఆయన సౌదీని వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా విదేశాంగశాఖ 16 మంది సౌదీ ప్రముఖులను నిషిద్ధ జాబితాలో చేర్చి వారు అమెరికా రావటంపై ఆంక్షలు విధించింది. అమెరికా అమలు చేస్తున్న ఫారిన్‌ ఆపరేషన్స్‌, రిలేటెడ్‌ ప్రొగ్రామ్స్‌ అప్రొప్రియేషన్స్‌ చట్టం ప్రకారం విదేశీ ప్రభుత్వాలకు సంబంధించిన ప్రముఖులెవరైనా అవినీతికి పాల్పడటం లేదా మానవ హక్కుల ఉల్లంఘించటం వంటి చర్యలకు పాల్పడితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అమెరి కాలో ప్రవేశించేందుకు అనర్హులుగా పరిగణిస్తామని విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది. గతంలో దాదాపు 25 మందికి పైగా సౌదీ ప్రముఖుల వీసాలను రద్దు చేసిన అమెరికా మరో 17 మంది ఆస్తులను స్థంభింప చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ వత్తిడి 
ఖషోగీ హత్య వెనక సౌదీ ఏజెంట్ల హస్తముందన్న ఆరోపణలను తొలుత తిరస్కరించిన సౌదీ సర్కారు తరువాత తమ అదుపులో లేని ఏజెంట్లు ఈ హత్యకు పాల్పడ్డారని అంగీకరించింది. ఇందుకు సంబంధించి 11 మంది అనుమానితులపై ఈ ఏడాది ఆరంభంలో విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఈ విచారణ ఏ దశలో వున్నదీ సౌదీ సర్కారు ఇంతవరకూ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో సౌదీ ప్రముఖులపై కొరడా ఝళిపించాలంటూ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌ సభ్యులు తీవ్రమైన వత్తిడి తెస్తుండటంతో విదేశాంగశాఖ ఈ ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com