"దలైలామా వారసుడి ఎంపికకు మా అనుమతి తప్పనిసరి" అంటూ మొరాయిస్తున్న చైనా
- April 11, 2019
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా అస్వస్థతకు గురైన నేపథ్యంలో అయన వారసుడి ఎంపిక మరోసారి వార్తల్లోకెక్కింది. దలైలామా వారసుడిగా ఎవరు ఎంపికైనా దానికి తమ అనుమతి తప్పనిసరని చైనా మరోసారి స్పష్టం చేసింది. బుధవారం నాడు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ మాట్లాడుతూ.. టిబెటన్ల పునర్జన్మల ఆచారం ప్రకారమే దలైలామా తదుపరి వారసుడి ఎంపిక జరుగుతుందని, ఐతే, ఆ ప్రక్రియ తమ దేశ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో మంగళవారం రాత్రి దలైలామా ఢిల్లీలోని దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని దలైలామా అధికార ప్రతినిధి తెన్జిన్ తక్లా తెలిపారు. టిబెట్‌ను 1950లో ఆక్రమించిన చైనా.. దలైలామాను ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణించింది. 1959 నుంచి ఆయన భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 ఏండ్లు.
దలైలామాను 1989లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. తాను మరణించిన తరువాత.. తన వారసుడిగా చైనా ఏకపక్షంగా ప్రకటిస్తే.. అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..
భారత్ నుంచే తన వారసుడు రానున్నాడని ఆయన గతంలో స్పష్టం చేశారు. ఐతే, దలైలామా వారసుడి ఎంపిక హక్కు తమదేనని చైనా ప్రకటించింది. టిబెటన్ల పునర్జన్మ నమ్మకాల ప్రకారం, దలైలామా మరణిస్తే, ఆయన ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే ప్రక్రియను బౌద్ధ గురువులు పూర్తి చేసి వారసుడిని ప్రకటిస్తారు. 1935లో జన్మించిన ప్రస్తుత దలైలామాను, ఆయన రెండేండ్ల వయసులో ఉండగానే మతగురువులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన 14వ లామాగా కొనసాగుతూ, వయసు పైబడిన కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







