ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

- April 13, 2019 , by Maagulf
ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

ఇజ్రాయెల్‌లో వరుసగా ఐదోసారి ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించిన బెంజిమిన్ నెతన్యాహూకు ఇబ్బంది కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే నెతన్యాహూకు షాక్ తగిలింది. చిన్న దేశం… పెద్ద కలలు అంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ విఫలమైంది.

చంద్రునిపై పరిశోధనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం బేరేషీట్‌ వ్యోమనౌకను పంపించింది. టేకాఫ్ సరిగానే జరిగినప్పటికీ ల్యాండింగ్‌లో ప్రాబ్లెమ్స్ వచ్చాయి. చివరి దశలో అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దాంతో చంద్రుని ఉపరితలంపై మరికాసేపట్లో ల్యాండవుతుందనగా కుప్పకూలిపోయింది.

ఇజ్రాయెల్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బేరెషీట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. బేరెషీట్‌ అంటే బైబిల్‌ పదబంధంలో ఆరంభంలో అని అర్థం. ఈ ప్రయోగం కోసం దాదాపు 100 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. స్పేస్‌ఐఎల్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నిర్మించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది దాదాపు 7వారాలపాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుని సమీపంలోకి చేరింది. గతవారమే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది. కానీ, చంద్రుని ఉపరితలంపై దిగేలోపే కూలి పోయింది.

ఏప్రిల్ 10న చంద్రునికి అతి సమీపంలోని దీర్ఝవృత్తాకార కక్ష్యలోకి బేరేషీట్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రవేశించింది. చంద్రుని ఉప రితలానికి 15-17 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆ వ్యోమనౌకలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో చంద్రుని ఉప రితలాన్ని ఢీకొట్టి ఒక్కసారిగా కుప్పకూలింది.

బేరేషీట్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సురక్షితంగా లాండర్‌ను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయెల్‌ ఘనత సాధించి ఉండేది. ఇప్పటివరకూ చంద్రునిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను దించగలిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com