ఫేస్‌బుక్‌ని ఫాలో అవుతూ.. అంబులెన్స్‌కి దారిస్తూ..

- April 17, 2019 , by Maagulf
ఫేస్‌బుక్‌ని ఫాలో అవుతూ.. అంబులెన్స్‌కి దారిస్తూ..

కేరళ:ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఏ చిన్న సహాయం చేసినా ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అదే చేశారు కర్ణాటక వాసులు. ఆపదలో ఉన్నది తమ బిడ్డగానే భావించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తమ వంతు సాయంగా అంబులెన్స్ వెళ్లేటప్పుడు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు.

కేరళలోని కసరగాడ్ పట్టణంలోని క్రిష్ట హాస్పిటల్‌లో మదని అనే మహిళకు 15 రోజుల క్రితం బాబు పుట్టాడు. పుట్టినప్పటినుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాబుని మెరుగైన వైద్యం కోసం మంగుళూరు ఆసుపత్రికి తరలించారు.

బాబుని పరీక్షించిన అక్కడి వైద్యులు శ్వాస నాళాలు మూసుకుపోయాయని, వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు. అయితే అక్కడ కాకుండా తిరువనంతపురంలోని మెడికల్ కళాశాలలో ఆపరేషన్ చేయించాలని సూచించారు.

కానీ కర్ణాటక నుంచి కేరళ తిరువనంతపురానికి చేరుకోవాలంటే 15 గంటల ప్రయాణం. 15 రోజుల బిడ్డని తీసుకుని ఎలా వెళ్లాలని ఆలోచించారు బాబు తల్లిదండ్రులు. విమానంలో వెళదామంటే ఆక్సిజన్ లెవల్స్ అందక ఇబ్బంది పడతాడని డాక్టర్లు వివరించారు.

దాంతో అంబులెన్స్ ద్వారా రోడ్డుపై ప్రయాణించాలనుకున్నారు. వారికి ఏ ఇబ్బందీ కలగకుండా కేరళకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘చైల్డ్ ప్రొటెక్ట్ టీమ్ కేరళ’ ఫేస్‌బుక్ లైవ్‌ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా అంబులెన్స్ ప్రయాణాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో అందరూ చూడొచ్చు.

అంబులెన్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. దీనివల్ల సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారివ్వడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఈ విధంగా 15 గంటల ప్రయాణాన్ని 10 గంటలలో పూర్తి చేసి బాబుని హాస్పిటల్‌కి తరలించారు. బాబు ప్రాణాపాయం నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com