నిజామాబాద్‌: రైతులు మరో సంచలన నిర్ణయం

- April 23, 2019 , by Maagulf
నిజామాబాద్‌: రైతులు మరో సంచలన నిర్ణయం

నిజామాబాద్‌ రైతులు మరోసంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికల్లో 185 మంది రైతులు పోటీ చేసి సంచలనానికి తెరలేపారు. ఇప్పుడు మోదీపై బరిలో దిగేందుకు సై అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు చలో వారణాసి కార్యక్రమం చేపట్టారు.

నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నట్టు రైతులు ప్రకటించారు. తామంతా స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు.

నిజామాబాద్‌లో పోటీ వ్యవహారాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయంగా వాడుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ ఎంపీ కవితే లక్ష్యంగా ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు సాధన కోసం ఐదేళ్లుగా ఆమె పోరాటం చేశారన్నారు. తమకు మద్దతుగా తమిళనాడు నుంచి కొందరు రైతులు వస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది రైతులు బరిలో నిలిచారు. ఇప్పుడు నేరుగా మోదీపై పోటీకి దిగుతుండడంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ నిజామాబాద్‌ రైతులపై పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com