ఇక స్వీగ్గీ, జొమాటోలు పాకప్..

- May 07, 2019 , by Maagulf
ఇక స్వీగ్గీ, జొమాటోలు పాకప్..

ఉన్న ఇద్దర్లో ఒకరికేమో వెజ్ బిర్యానీ, మరొకరికేమో చికెన్ బిర్యానీ అంటే ఇష్టం.. అనుకోకుండా వచ్చిన అతిధులు.. చింటూగాడి బర్త్‌డే.. వట్టి కేక్ కటింగే అంటే బాగోదు. 4 పార్సిల్స్ బిరియానీ ఆర్డర్ చేస్తే నలుగురూ తినేస్తారు. ఇలా కారణమేదైనా.. ఉందిగా స్విగ్గీ, జొమాటో.. అందుకే అంత ధైర్యం. ఆరాంగా కూర్చుని అమ్మాయి చెప్పినవన్నీ ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో కాలింగ్ బెల్ మోగుతుంది. చేతిలో వేడి వేడి పార్సిల్‌తో స్విగ్గీ బాయ్‌లు, జొమాటో బాబులు ప్రత్యక్షమవుతారు. ఇలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి కారణమేమీ అక్కర్లేదు.. రోజూ వండే వంట బోర్ కొట్టేస్తుంటే అప్పుడప్పుడు ఇలా బయటి ఫుడ్‌కి ట్రై చేస్తుంటారు నగర వాసి.

లిప్ట్‌లో కలిసిన మూడో ఫ్లోర్ ఆంటీ ఓ రోజు.. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉంటే చెప్పమ్మా నేను తయారు చేసి ఇస్తాను.. ఓ సారి ట్రై చేసి చూడండి.. నచ్చితే మీరు మరొకరికి చెప్పండి అనేసరికి.. కాదనలేక ఓకే చెప్పింది వనజ. ఆంటీ పంపించిన ఐటెంస్ అన్నీ అతిధులకు బాగా నచ్చాయి. వనజా వాళ్లాయనకైతే చెప్పక్కర్లేదు. వెంటనే.. ఫోన్ అందుకుని మా అపార్ట్‌మెంట్లో ఆంటీ అంటూ మరికొంత మందిని ఎంగేజ్ చేశారు. దీంతో ఆంటీ బిజినెస్ పెరిగింది. రుచిగా, శుచిగా వండుతోంది. అన్నీ వేడివేడిగా అందిస్తోంది. ఇంతకంటే ఇంకేం కావాలి. ఇక స్విగ్గీ, జొమాటో ఎందుకని ఆ యాప్ డిలీట్ చేసింది వనజ. ఇలా నగరంలో చాలా మందే అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కనీసం ఒక్కరైనా ఇలాంటి వారు కనిపిస్తున్నారు. తమకు వచ్చిన వంటనే ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు.

బ్రేక్ ఫాస్ట్ నించి మొదలు, లంచ్, డిన్నర్ అన్నీ నిమిషాల్లో రెడీ చేసేస్తున్నారు. చక్కటి హోమ్ ఫుడ్ రుచిని అందిస్తున్నారు. భోజన ప్రియులు అచ్చంగా మా అమ్మ చేసిన వంటలాగే ఉందంటూ లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. ఇలాంటి వారితోనే కొంత పెద్ద మొత్తంలో ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్ పుట్టుకొచ్చింది. ఈ గ్రూపులో 20 వేల మంది ఉండగా పూటకు రెండున్నర వేల ఆర్డర్లు వస్తున్నాయట. రుచి, శుచి పాటించడంతో పాటు బయట హోటళ్ల కంటే తక్కువ రేటుకే విక్రయించడం వల్ల వీటి ప్రాబల్యం పెరుగుతోంది. ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బెంగుళూరుకు చెందిన ఈ ఫుడ్డీ బడ్డీలను చూసి స్విగ్గీ, జొమాటోలకు భయం పట్టుకుందట.

నిజానికి స్విగ్గీ, జొమాటోల బిజినెస్ దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్లకు చేరుకోగా, అందులో 32 శాతం వాటా ఒక్క బెంగళూరు నుంచే వస్తోందట. ఇప్పుడు దానికి ఈ ఆంటీలు టెండర్ పెడుతున్నారని వారి బాధ. ఇలాంటివి ఎన్ని వచ్చిన ఫుడ్ మార్కెట్‌కి ఢోకా ఉండదు. అద్దాల మేడల్లో 5 స్టార్ హోటల్స్ మెరిసిపోతున్నా అక్కడ ఉండే జనం అక్కడ ఉంటున్నారు. వీధి చివర వేడి బజ్జీలు, సమోసాలు వేసే బండి ఉంటే అక్కడా జనం ఉంటున్నారు. ఇంట్లో రుచికరంగా వండి వడ్డించే ఇల్లాలున్న అప్పుడప్పుడూ బయటి ఫుడ్‌కి ట్రై చేస్తుంటారు ఇల్లాలితో సహా. అంచేత పాక శాస్త్రం మూడు ప్లేట్లు, ఆరు పార్శిళ్లతో ఎప్పటికీ నభూతో నభవిష్యత్‌గా వర్థిల్లుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com