ఫోని తుఫాను ఎఫెక్ట్.. తీవ్రంగా దెబ్బతిన్న సమాచార వ్యవస్థ

ఫోని తుఫాను ఎఫెక్ట్.. తీవ్రంగా దెబ్బతిన్న సమాచార వ్యవస్థ

ఫోని తుఫాను ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలకు లెక్కే లేదు. కరెంట్ పోల్స్‌ వేలాదిగా కూలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. వందలాది గ్రామాలు రోజుల తరబడి చీకట్లో చిక్కుకుపోయాయి. భారీ ట్రాన్స్‌మిషన్‌ టవర్లు, పవర్‌ గ్రిడ్‌లు కూడా ధ్వంసం కావడంతో పునరుద్ధరణకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. 5 వేల 30 కిలోమీటర్ల 33 కేవీ విద్యుత్‌ లైన్లు నాశనమ్యాయి. 38 వేల 613 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 11 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కాగా, దాదాపు లక్ష 60 వేల విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి.

ఫోనీ ధాటికి సమాచార వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మొబైల్ టవర్లు కూలిపోవడంతో సిగ్నల్ సమస్యలు తలెత్తి ఫోన్లు సరిగా పనిచేయలేదు. అత్యవసర సమాచారాన్ని పంపించడం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం ‘హామ్ ఆపరేటర్లను’ సంప్రదించింది. దాంతో హైదారాబాద్ నుంచి కె.రమేష్, అరికెపూడి సురేష్ కుమార్, విజయవాడ నుంచి రవితేజలు మే 3వ తేదీన భువనేశ్వర్‌కు వెళ్లారు. అక్కడ సచివాలయంలో ‘హామ్ స్టేషన్‌’ను ఏర్పాటు చేశారు. మే 4న బెంగాల్ నుంచి దీప్, అరుణవ్, గోవింద్‌లు కూడా ఒడిశాకు చేరుకొని పూరీ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ‘హామ్ స్టేషన్’‌ను ఏర్పాటు చేశారు. మే 5న రవి తేజ, ఖుర్దా జిల్లాకు వెళ్లి అక్కడ హామ్ స్టేషన్‌ను నెలకొల్పారు. తద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునే వీలు కలగడంతో సహాయ చర్యలు వేగవంతం అయ్యాయి. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు అవకాశం దొరికింది. పూరీ, కుర్దా జిల్లాల్లో విద్యుత్‌, టెలికాం వ్యవస్థలను పునరుద్ధరించేందుకు మరో 5 రోజులు సమయం పడుతుందని హామ్‌ ఆపరేటర్లు చెప్పారు.

Back to Top