కర్నాటకలో తీవ్ర రాజకీయ సంక్షోభం

- July 06, 2019 , by Maagulf
కర్నాటకలో తీవ్ర రాజకీయ సంక్షోభం

కర్నాటకలో తీవ్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్న వీరంతా తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి లేఖలు ఇచ్చారు.

గతంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు తమశాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆనంద్ సింగ్, రమేష్ జార్కహళ్లిలు ఇద్దరూ కూడా వారం రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా మరో 13మంది కూడా అదేబాట పట్టడంతో ప్రభుత్వం మైనార్టీలో పడనుంది. ప్రభుత్వం ఏ క్షణంలో అయినా పడిపోయే అవకాశాలున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కర్నాటకలో వేగంగా పరిణామాలు మారాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ద్వారా కొందరిని దారిలోకి తెచ్చుకున్నారు. అయినా మరికొంతమంది అసంతృప్తిగానే ఉన్నారు. వారే ఇప్పుడు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే రాజీనామాకు ముందే వారు బీజేపీ నేతలతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో వీరిని గెలిపించుకుంటే.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వారితో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది.

అటు ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికాలో ఉండగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీరంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజీనామాల నేపథ్యంలో కుమారస్వామి హుటాహుటిన అమెరికా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. కుమారస్వామి వచ్చిన తర్వాత మైనార్టీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా? లేక రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారా అన్నది ఆసక్తిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com