రైల్వేను ప్రైవేటీకరణ చేయం..కానీ!..అంటూ వివరించిన పీయూష్ గోయల్

రైల్వేను ప్రైవేటీకరణ చేయం..కానీ!..అంటూ వివరించిన పీయూష్ గోయల్

న్యూఢిల్లీ : రైల్వే రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని, అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కానీ... జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు రావాలంటే ప్రైవేట్ పెట్టుబడులు కావల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు. లోక్‌సభలో రైల్వే గ్రాంట్స్ గురించి మాట్లాడుతూ... రైల్వేలో ప్రజల డిమాండ్లకు తగ్గట్లు అవసరాలను సమకూర్చాలంటే మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం అవసరని, కొన్ని యూనిట్లను కార్పొరేట్ చేయాల్సిందేనని తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో రూపొందించిన రైల్వే బడ్జెట్లు పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉండేవని, అలాగే వారి వారి రాజకీయ లాభాపేక్షలను దృష్టిలో ఉంచుకొని రూపొందిచేవారని తీవ్రంగా విమర్శించారు. చిన్నతనంలో రైల్వే స్టేషన్లలో టీ అమ్ముతూ ఉన్న వ్యక్తి నేడు రైల్వేలకు ఏయే అవసరాలో వాటిని గుర్తించి, నెరవేరుస్తున్నారని పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి గోయల్ ప్రశంసించారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క కొత్త రైల్వే కోచ్ కూడా తయారు చేయలేదని, అదే బీజేపీ హయాంలో తయారు చేశామని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు.

మరోవైపు 2006 లో జరిగిన రైల్వే పేలుళ్లపై అప్పటి యూపీఏ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని ఆయన విమర్శించారు. అప్పుడు గనుక మోదీ ప్రభుత్వం ఉంటే మాత్రం కచ్చితంగా ఉగ్రవాదులకు గట్టి సమాధానాన్నే ఇచ్చి ఉండేవారని ఆయన తెలిపారు. ఈ పేలుళ్లలో 209 మంది ప్రయాణికులు మరణించగా, దాదాపు 700 మంది గాయపడ్డారని, అయినా సరే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, దీటైన సమాధానమూ చెప్పలేదని పీయూష్ దుయ్యబట్టారు.

Back to Top