టిక్ టిక్1,2,3. చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ

- July 14, 2019 , by Maagulf
టిక్ టిక్1,2,3. చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ

చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 20 గంటలపాటు నిర్విరామంగా కౌంట్ డౌన్ కొనసాగనుంది. సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు GSLV మార్క్3-M1 రాకెట్ ప్రయోగం జరుగనుంది. ఇస్రో ..రాకెట్ లో 3.8 టన్నుల బరువైన చంద్రయాన్-2 మిషన్ ను అమర్చింది. కౌంట్‌డౌన్ తర్వాత.. చంద్రయాన్-2 మిషన్‌ను మోసుకెళ్లే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

చంద్రయాన్-2లో ఆర్బిటల్ అనే పరికరం ద్వారా ల్యాండర్, రోవర్ లను శాస్త్రవేత్తలు చంద్రునిపై దింపనున్నారు. 52 రోజుల పాటు 3.50 లక్షల కి.మీ చంద్రయాన్-2 ప్రయాణించనుంది. సెప్లెంబర్ 6వ తేదీ చంద్రయాన్-2..చంద్రునికి 30 కి.మీ ఎత్తులో దిగనుంది. ఈ ప్రయోగాన్ని తిలకించడానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు మధ్యాహ్నం షార్ కేంద్రానికి చేరుకోనున్నారు. షార్ పరిసర ప్రాంతాలు కేంద్ర బలగాల నిఘా నేత్రంలో ఉన్నాయి.

ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 గంటల పాటు కౌంట్‌డౌన్ జరుగనుంది. ఇస్రో ఇప్పటివరకూ చేపట్టిన ప్రయోగాలన్నింటికంటే చంద్రయాన్‌-2 చాలా సంక్లిష్టమైంది. జాబిల్లి చుట్టూ తిరిగే ఆర్బిటర్‌.. ఉపగ్రహంపై దిగే ల్యాండర్లు రెండింటినీ జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా పంపనున్నారు. ల్యాండర్‌ జాబిల్లిపైకి సురక్షితంగా దిగాక అందులోంచి రోవర్‌ బయటకు వచ్చి ఉపరితలంపై దాదాపు అర కిలోమీటర్‌ దూరం ప్రయాణిస్తుంది. జీఎస్‌ఎల్వీ రాకెట్‌ ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడితే 50 రోజుల ప్రయాణం తరువాత అది జాబిల్లిపైకి చేరుతుంది. జాబిల్లికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దశలో ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ వేరుపడుతుంది.

నాలుగు రోజులపాటు చక్కర్లు కొడుతూ నెమ్మదిగా వంద కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. దశలవారీగా వేగాన్ని 30 కిలోమీటర్లకు తగ్గించుకొని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతుంది. చందమామ ఉపరితలంపైకి ల్యాండర్‌ దిగిన నాలుగు గంటల తరువాత అందులోంచి రోవర్‌ బయటపడుతుంది. సెకనుకు ఒక సెంటీమీటర్‌ వేగంతో ల్యాండర్‌ నుంచి వేరుపడి ఆ తరువాత 14 రోజుల్లో సుమారు 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ల్యాండర్‌పై మన జాతీయ పతాకాన్ని ముద్రించారు. రోవర్‌కు ఉన్న ఆరు చక్రాలపై అశోకచక్రను ముద్రించారు.

చంద్రయాన్‌-2 మొత్తం ఖర్చు 978 కోట్లుకాగా అందులో 603 కోట్లు ల్యాండర్, ఆర్బిటర్ల నిర్మాణానికి, నేవిగేషన్, భూమ్మీది నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఖర్చు పెట్టారు. మిగిలిన 375 కోట్లను జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 నిర్మాణం, క్రయోజెనిక్‌ ఇంజిన్, ఇంధనాల కోసం ఉపయోగించారు. ఇప్పటికే రిహార్సల్స్‌ పూర్తి చేశారు. ఎఫ్‌డిఆర్‌, లాంచింగ్‌ రిహార్సల్స్‌ కూడా ముగిశాయి. చంద్రయాన్‌ - 2లోని వ్యవస్థలు ఎలా స్పందిస్తున్నాయన్న విషయాన్ని డమ్మీ కమాండ్స్‌ ద్వారా పరిశీలించారు.

సిగ్నల్స్‌, కమ్యూనికేషన్‌ లింక్స్‌ను సరిచూశారు. జీఎస్‌ఎల్‌వి మార్క్‌ 3-ఎం-1 లాంచ్‌ వెహికిల్‌ సిస్టమ్స్‌, ఆర్బిటర్‌, విక్రమ్‌ హెల్త్‌ చెకింగ్‌ సహా... పలు టెక్నికల్‌, సైంటిఫిక్‌ టెస్ట్‌లు నిర్వహించారు. రాకెట్‌లోని ఇంధనం నింపే ట్యాంకులకు ప్రీ ఫిల్‌ ప్రెజరైజేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చంద్రయాన్-2 సక్సెస్ అయితే జాబిల్లిపైకి ఓ ల్యాండర్‌ను ప్రయోగించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com