యానిమేషన్ స్టూడియోకు నిప్పంటించిన వ్యక్తి

యానిమేషన్ స్టూడియోకు నిప్పంటించిన వ్యక్తి

జపాన్: జపాన్‌లోని ఓ యానిమేషన్ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన గురువారం క్యోడో నగరంలో చోటుచేసుకుంది. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ప్రమాదం కాదని ఎవరో కావాలనే స్టూడియోకు నిప్పు అంటించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై లోతైన విచారణ చేస్తున్నామని చెప్పారు. "చావండి "అంటూ గట్టిగా అరుస్తూ ఓ వ్యక్తి స్టూడియో చుట్టూ పెట్రోల్ పోయడాన్ని కొందరు గమనించి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అగ్ని కీలలు ఎగిసి పడటంతో ఆ వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. దీంతో పూర్తి వివరాలు ఇంకా పోలీసులు సేకరించాల్సిఉంది. ఇక అగ్ని కీలలు క్యోటో యానిమేషన్‌ బిల్డింగ్‌ నుంచి ఎగిసిపడటం సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పలు సిరీస్‌లు సినిమాలు ఈ స్టూడియోలోనే యానిమేషన్‌ వర్క్ జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా సౌండ్ యూఫోనియం, ఫ్రీ రోడ్ టు ద వరల్డ్, సినిమాలు ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా అక్కడ స్టూడియో అగ్నికి దహనం కావడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

ఒక వ్యక్తి మాత్రం అగ్నికి దహనమై చనిపోయి కనిపించాడని అయితే మిగతా వారు జాడ కనిపించలేదని క్యోటో నగర ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మొదటి అంతస్తు, రెండో అంతస్తులో ఉన్నవారి జాడ కనిపించడం లేదని ఆయన అన్నారు. మరోవైపు 36 మందికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మంటలు ఆవహించిన సమయంలో స్టూడియోలో మరో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతామని పోలీస్ అధికారులు తెలిపారు.

Back to Top