ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇకలేరు..

- July 25, 2019 , by Maagulf
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇకలేరు..

సమ్మోహన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఈ తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. సాహితీవేత్త అయిన శ్రీకాంత్ శర్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 75 ఏళ్లు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో 1944 మే 29న జన్మించారు. ఆయన భార్య జానకీబాల కూడా రచనా రంగంలో స్థిరపడ్డారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచనా రంగం పట్ల ఆసక్తితో రచయితగా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు. పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు రచించారు.

ఆంద్రజ్యోతి పత్రికలో ఉపసంపాదకుడిగా, ఆంధ్రప్రభ పత్రికకు సంపాదకుడిగా చాలా కాలం పని చేశారు. కృష్ణావతారం, నెలవంక, రావుగోపాలరావు, రెండుజళ్ల సీత, పుత్తడిబొమ్మ, చైతన్యరథం వంటి చిత్రాల్లో శ్రీకాంత్ శర్మ పాటలు రాశారు. కుమారుడు మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాలో ‘మనసైనదేదో’ ఆయన రాసిన చివరి పాట. కుమార్తె కిరణ్మయి డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఆయన ఆత్మకథ ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పాఠకాదరణ పొందింది. అల్వాల్ స్వర్గధామ్‌లో ఈ రోజు సాయింత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, శ్రీకాంత్ శర్మ మృతికి సంతాపం తెలుపుతూ హీరో నానీ ట్వీట్ చేశారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఆయనొక మేధావి అని, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అష్టాచమ్మా సినిమాని చూసి శ్రీకాంత్ శర్మగారు.. మోహన్ గారిని, మమ్మల్ని చూసి ఆయన ఎంత గర్వపడ్డారో మరచిపోలేనని అన్నారు. హీరో సిద్దార్థ్ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com