కేరళను అతలాకుతలం చేస్తోన్న వరదలు..

- August 11, 2019 , by Maagulf
కేరళను అతలాకుతలం చేస్తోన్న వరదలు..

కేరళ:వరదలు, వర్షాలు సృష్టిస్తున్న బీభత్సంతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఓ వైపు భారీ వరదలు.. మరోవైపు విరిగిపడుతోన్న కొండ చరియలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. వేలాది గ్రామాలు నీటమునగడంతో లక్షలాది మంది సర్వం కోల్పోయి అల్లాడిపోతున్నారు.
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్, మల్లపురం, కన్నూరు, ఇడుక్కి జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు 42 మంది మృతిచెందగా.. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.. అటు కొండచరియలు విరిగిపడి పలువురు గల్లంతయ్యారు.

ఇప్పటికే 14 జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో మొత్తం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మణిమాల, మీనాచల్, మూవత్తుపుళ, చలియార్, వలపట్టణం, పంబ నదులు ప్రమాదరకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పెరియార్ నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచేసింది. పెరియార్ నది ఒడ్డున ఉన్న ప్రముఖ శివాలయం నీట మునిగింది. 13 ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు గరిష్ట స్థాయికి చేరడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తుతోంది..

చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడి జనాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మున్నార్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి రాకపోకలు ఆగిపోయాయి. అటు బలమైన గాలులకు చెట్లు నేలకూలుతున్నాయి. విద్యుత్ స్థంబాలు విరిగిపడిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో చాలావరకు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మరోవైపు ఇళ్లు కూలిపోవడంతో జనం నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకోడానికి పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, సైనిక బలగాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. 315 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సహాయక చర్యల్లో భాగంగా భవాని నది ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబాన్ని తీరం దాటించడం కోసం రెస్క్యూ టీమ్‌ పెద్ద సాహసమే చేసింది.. ఇంట్లోని ముసలి వారిని క్షేమంగానే నది దాటించగలిగినా.. గర్భిణితోపాటు ఆమె బిడ్డను తాళ్ల సాయంతో నదిదాటించాల్సి వచ్చింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఓ కుటుంబంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రాణాలు కాపాడుకోడానికి వ్యక్తి పరుగులు తీశాడు. అతని తల్లిని కొండచరియలు బలితీసుకున్నాయి.. ఇంటిపైనా పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో అతని భార్య, కొడుకు గల్లంతయ్యారు.

మరోవైపు రాహుల్‌ గాంధీ నేడు వయనాడ్‌లో పర్యటించున్నారు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోనున్నారు.. ఇప్పటికే వయనాడ్‌ను ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు రాహుల్.. తాజాగా ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com