గల్ఫ్ వలసకార్మికులు ప్రవాసులు కారా?
- January 08, 2016
రెండు దశాబ్ధాలపాటు దక్షిణాఫ్రికాలో గడిపిన జాతిపిత మహాత్మాగాంధీ 1915, జనవరి 9న ముంబాయికి తిరిగొచ్చారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.
ఊరుగానీ ఊరు, దేశం గానీ దేశంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిత్య జీవన పోరాటం చేసే ప్రవాస భారతీయులకు ఈ దేశం ఏమిచ్చిందన్న ప్రశ్నకు జవాబు కోసం వెతుక్కోవాల్సిందే. ఏడాదికొకసారి ఆర్భాటంగా ప్రవాస భారతీయ దివస్ పేరిట సందడి చేయటం మినహా విదేశాలకు వెళ్లిన భారతీయ మూలాలున్న వ్యక్తులకు భారత ప్రభుత్వం నుంచి తగినంత మద్దతు లభించడం లేదు. ఏటా ఎంత సొమ్ము వెనక్కి పంపిస్తారు. పంపించే మొత్తాలు ఏ మేరకు పెరుగుతాయని లెక్కలేసుకుంటారు.
ఎన్ఆర్ఐలు పంపే సొమ్ము పట్ల ఆశలు పెంచుకోవడం తప్ప వారి అవసరాలను తీర్చడం, సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఏ దశలోనూ శ్రద్ద చూపడం లేదు.
అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లేవారు ఉన్నత విద్య, ఎంతో నైపుణ్యం విశేష ప్రతిభ కలిగిన వారుంటారు. కానీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు మాత్రం ప్రధానంగా అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు స్వదేశంలో పూటగడవక, చేసేందుకు పనిలేక విదేశాల్లో కష్టపడి కాస్త సొమ్ము మిగుల్చుకుని భారత్కు తిరిగి వద్దామన్నది వారి ఉద్దేశం. గల్ఫ్ సహా 17 (ఇసీఆర్-ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్) దేశాల్లో సుమారు 60 లక్షల మంది భారతీయ వలస కార్మికులు పని చేస్తున్నట్టు ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతేడాది ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన వలస కార్మికులు 10 లక్షల మంది ఉన్నట్టు అంచనా. ఇందులో 50 శాతం మంది 15-30 వయస్సులోపు వారే. వీరిలో ఎక్కువ మంది 10వ తరగతిలోపు చదువుకున్నవారే. యూఏఈ ఇతర దేశాల్లో నివసించే ప్రవాసుల సమస్యలకు మూలం అక్కడి ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలే కారణం.
ఈ దేశాల్లోని పౌర, నేర, కార్మిక చట్టాలన్ని స్థానిక యజమానులకు కొమ్ముకాసేవిగానే ఉంటాయి. అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలో భారతీయులు సెటిల్మెంట్ మైగ్రెంట్ (ఐఎల్ఓ ప్రకారం) కోరవచ్చును కానీ గల్ఫ్దేశాల్లో మాత్రం వారు కాంట్రాక్టు ప్రవాసులుగానే గుర్తించబడతారు.
అదీ కఫాల పద్ధతిలోనే.గల్ఫ్దేశాల్లో నిబంధనల మార్పుకారణంగా తరచుగా వీరు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వీసాల విషయాల్లో జరిగే మోసాలు చాలామందిని రోడ్డున పడేస్తున్నాయి. పత్రాలు సరిగాలేని కారణంగా గల్ఫ్దేశాల్లో జైళ్లలో మగ్గిపోతున్న వారినెందరినో పట్టించుకునేనాధుడే లేడు. ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలు సమర్థవంతంగా అమలుకావటం లేదు.
యూఏఈలో ఒప్పందానికి భిన్నంగా కార్మికులతో రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయిస్తారు. వారికి ఆరోగ్య సంరక్షణ సదుపాయాలేవీ ఉండవు. అమానవీయ పరిస్థితుల మధ్య క్యాంపుల్లో దుర్భర జీవితం గడపవలసి ఉంటుంది. అందరికన్నా ఎక్కువ దోపిడీకి గురయ్యేది ఇండ్లల్లో పనిచేసేవారు, తోటపనివారు. స్థానిక కార్మిక చట్టాలలో వీరికి ఎలాంటి గుర్తింపు ఉండదు. అన్నిటికన్నా ఘోరమైంది వారి పాస్పోర్టులను యజమానులు లాక్కోవటం. దీనితో వారు అక్షరాల నిర్బంధ శ్రామికులుగా మారిపోతారు. యూఏఈ ప్రభుత్వం దీనిని చట్టవ్యతిరేకమని ప్రకటించినప్పటికీ ఇది ఇంకా రివాజుగానే కొనసాగుతోంది.
గత ఏడాది ఆగస్టులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ దుబారు క్రికెట్ స్టేడియంలో ప్రసంగిస్తూ అక్కడి భారతీయుల్లో జాతీయవాద అభిమానాన్ని ప్రేరేపించి స్వదేశంలో వారిని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు చూశారే తప్ప వారి భద్రతకు సంబంధించి ఏ ప్రకటనా చేయలేదు.
తెలంగాణ ఉద్యమసమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలు సభలు, సమావేశాల్లో నిరంతరంగా ''ఏమున్నయి తెలంగాణ బతుకులు, దుబాయి, బొంబాయి బొగ్గుబాయితప్ప అనేవారు. తెల,గాణ వచ్చినంక మాత్రం దుబాయి, బొంబాయి బతుకుల ఊసే ఎత్తడం లేదు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వ పెద్దలు బానిస బతుకులీడుస్తున్న తెలంగాణ బిడ్డల విముక్తికి విస్తృత ఆలోచనలు చేయాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పారిశ్రామీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
వాస్తవానికి గుప్పెడు మంది బడా వ్యాపారస్తులు తీసుకువస్తున్న విదేశీ పెట్టుబడుల కంటే గంపెడుమంది గల్ఫ్ కూలీలు పంపిస్తున్న చిన్నాచితక విదేశ ఙసంపాదన మొతÊం కలిపితే చాలా ఎక్కువ. అందుచేత పెట్టుబడిదారులకు పరుస్తామంటున్న ఎర్రతివాచీలు కాకపోయినా దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ చిన్నాచితక కూలీలు అందించే విదేశీ సంపాదనను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
కార్మికుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
- సచివాలయంలో ఉన్న ఎన్ఆర్ఐ సెల్ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి.
- ప్రతి జిల్లా కార్యాలయంలో ఎన్ఆర్ఐ విభాగాలను ఏర్పాటు చేయాలి.
- ఎన్ఏసీ కేంద్రాలను బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి సబ్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేయాలి.
- గల్ఫ్లో చనిపోయిన 550 మంది కుటుంబాలవారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా (మృత ధన సహాయం) అందజేయాలి.
- మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్లను నియంత్రించాలి.
-ప్రవాస భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఒక మంత్రిని నియమించాలి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ప్రవాసుల కోసం నిధులు కేటాయించాలి.
- గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు సహకరించాలి.
- ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి.
- హైదరాబాద్లోనూ ఎంబసీని ఏర్పాటు చేయాలి.
- గల్ఫ్ దేశాల్లో తెలుగువారి స్వచ్ఛంద సంస్థలన్నింటిని రాజకీయాలకతీతంగా గుర్తించి, అనుసంధానపరచి అక్కడి కార్మికులకు మద్దతుగా ఉండేలా ప్రోత్సహిస్తే అనేక సమస్యలకు పరిష్కారం వెంటనే లభిస్తుంది.
- రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో వలసలపై అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
- గల్ఫ్ వలస కార్మికులు చాలామంది ఫేస్బుక్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాలను వాడుతున్నారు. కావున ప్రభుత్వ కూడా వీటి ద్వారా వారికి చేరువవుతూ సమస్యలను పరిష్కరించాలి.
--- గుయ్య సాయిక్రిష్ణ యాదవ్
గల్ఫ్ వలసలపై పరిశోధక విద్యార్థి
ఉస్మానియా యూనివర్సిటీ
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







