జీవితం అంటే తెలియని కొన్ని జీవాలు....!!

- January 09, 2016 , by Maagulf

మంచికో చెడుకో ఒకసారి చేయి పట్టుకున్నాక చివరి వరకు విడువను అది తప్పైనా ఒప్పైనా...!!  ఇంత మంచి
మనసు ఎంత మందికి ఉంటుంది..?? పెళ్ళి  అంటే అదో తంతు, మన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఓ ఆడంబరమైన వేదికగా కళ్యాణ వేదికను,  మన వెనుక ఉన్న డబ్బును హోదాను చూపించుకోవడానికి మాత్రమే అని అనుకుంటున్న రోజులు ఇవి... పాణిగ్రహణాన్ని, వేద మంత్రాలను వాటి అర్దాల ప్రమాణాలను మరచి పోయి, మన అవసరం కోసమో లేదా ఓ నమ్మకానికి చావు వీలునామా రాయడానికో, మనలోని మరో రూపాన్ని చూపించడానికో, పంతం నెగ్గించుకోవడం కోసం మంచితనం నటించి ఆ నటనలో నలుగురిని నమ్మించి, జతగా వచ్చిన బంధం ఏమైనా పర్లేదు మనం, మన వాళ్ళు బావుంటే చాలు, ఆ మనసు మనిషి ఏమైపోతే మనకెందుకు....మన డాబు దర్పం నలుగురికి కనబడితే సరిపోతుంది...అనుకుంటే ఇక ఈ బంధానికి విలువ, అర్ధం ఉండాలా....!!
ఇచ్చిన మాట తప్పడం అంటే చావుతో సమానం.... అది ఏ విషయంలోనైనా ఒక్కటే....మాట నిలుపుకోలేనప్పుడు అస్సలు మాటే జారకూడదు...కాకపొతే ఇప్పుడు ప్రమాణాలకు ప్రామాణికాలు లేకుండా పోయాయి...డబ్బు,హోదాల కోసం ఒకటేంటి ఆలుబిడ్డలను కూడా అవసరానికి వాడుకునే ఎందరో జాతి రత్నాలు మనకు తారస పడుతూనే ఉన్నారు...మంచితనం ముసుగులో అయిన వాళ్ళను పరాయి వాళ్ళుగా చేసి తామే ప'రాయిగా' అయిపోతూ...  తన చుట్టూ చేరే నలుగురు వాళ్ళ అవసరానికి వేసే దండలు గంధపు మాలలుగా మురిసిపోతూ జీవితంలో తామేం కోల్పోతున్నామో....తన కోసం ఎదురుచూసే వారికి ఎంతటి సంతోషాన్ని ఇస్తున్నారో తెలుసుకోకుండా.... కోల్పోతున్న అనుబంధాన్ని తెలుసుకోకుండా... నిరర్ధకమైన జీవితాన్ని చాలా గొప్పగా బతికేస్తున్నా అని సరిపెట్టుకుంటూ అసలు జీవితం అంటే తెలియని కొన్ని జీవాలు....!! మనసును మర్చిపోయిన మనుష్యులు ఎదుటివారి మనసులను కూడా చిద్రం చేసి చోద్యం చూస్తూ నేనే గెలిచాను అనుకుంటే.. అది గెలుపో... లేక తన ఓటమో కూడా తెలియని ఆ మూర్ఖుల మానసిక స్థితిని చూసి నవ్వుకోవడం తప్ప చేయగలిగినది ఏమి లేదు...!!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com