సహ చట్టంతో సమాధానం రాబట్టిన గల్ఫ్ మృతుడి భార్య

- October 13, 2019 , by Maagulf
సహ చట్టంతో సమాధానం రాబట్టిన గల్ఫ్ మృతుడి భార్య

తెలంగాణ:జగిత్యాల జిల్లా వెలగటూరు మండల కేంద్రానికి చెందిన గుమ్ముల రమేష్ (39) మెదడులో రక్తనాళాలు చిట్లి యుఎఇ దేశంలోని జనవరి 2019 లో షార్జాలో మరణించాడు. కంపెనీ నుండి రావలసిన  జీతం బకాయిలు, గ్రూపు ఇన్సూరెన్సు, పరిహారం తదితర  ప్రయోజనాల సొమ్మును ఇప్పించాలని మరియు  ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని అతని భార్య రజిత తేది: 18.03.2019 న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించింది. 

తన ఇద్దరు పిల్లలు కుమార్తె సంజన (12), కుమారుడు హర్షిత (10) లను వెంటబెట్టుకొని కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాలారిగేలా తిరిగినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. ఆరు నెలల తర్వాత... తాను ఇచ్చిన దరఖాస్తు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపవలసినదిగా తేది: 21.09.2019 న సమాచార హక్కు చట్టం క్రింద జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించింది. వారం రోజుల్లో తేది: 27.09.2019న సమాధానం రాబట్టింది. 

అధికారుల అలసత్వం 

గుమ్ముల రజిత ఇచ్చిన దరఖాస్తును జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు చాలా కాలం మూలన పడేశారు. జులై 3న వెలగటూరు తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆగస్టు 2న ప్రభుత్వానికి నివేదిక పంపారు. మృతుడు గుమ్ముల రమేష్ కు ఎలాంటి వ్యవసాయ భూమి లేదని, చిన్న ఇల్లు మాత్రం ఉన్నదని, దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్) కుటుంబమని, ప్రభుత్వ ఇచ్చే ఆర్ధిక సహాయానికి అర్హులని ఆ నివేదికలో పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, తల్లి, తండ్రి ఉన్నారని పేర్కొన్నారు. 

రూ. 5 లక్షల మృతధన సహాయం ఇవ్వాలి 

ప్రభుత్వం వెంటనే స్పందించి గల్ఫ్ లో మృతి చెందిన గుమ్ముల రమేష్ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) ఇవ్వాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి 2 అక్టోబర్ 2019 వరకు అయిదు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో గల్ఫ్ దేశాల నుండి 1261 మంది తెలంగాణ ప్రవాసుల మృత దేహాలు శవపేటికలలో శంషాబాద్, హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు శంషాబాద్ పోలీస్ స్టేషన్ రికార్డుల వలన తెలుస్తున్నదని మంద భీంరెడ్డి తెలిపారు. గల్ఫ్ లో మృతి చెందిన పేద కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఇందుకోసం తగిన బడ్జెట్ కేటాయించాలని ఆయన కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com