సిద్దూకు పాక్ వీసా..కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా

- November 07, 2019 , by Maagulf
సిద్దూకు పాక్ వీసా..కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా

కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్నేహితుడైన నవజోత్ సింగ్ సిద్దూ కర్తార్‌పూర్ పర్యటన కోసం పాక్ సర్కారు వీసా మంజూరు చేసింది. ఈ నెల 9వతేదీన కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభ కార్యక్రమానికి రావాలని సిద్దూను ఆహ్వానించిన పాకిస్థాన్ హై కమిషన్ వీసాను కూడా జారీ చేసింది. దీంతో సిద్దూ పాక్ దేశంలో పర్యటించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. పాక్ జారీ చేసిన వీసా ప్రకారం సిద్ధూ వాఘా సరిహద్దు మీదుగా పాక్ దేశానికి వెళ్లవచ్చు. కానీ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కావడంతో కేంద్రం ఆయన పర్యటనకు అనుమతి మంజూరు తప్పనిసరి.

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నవజోత్ సింగ్ సిద్ధూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ఆ లేఖలో తనను కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినందున, తాను పాక్ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సిద్ధూ కోరారు.సిక్కు భక్తునిగా తాను గురు బాబా నానక్ కార్యక్రమంలో పాల్గొనడం తనకిచ్చే గొప్ప గౌరవంగా సిద్ధూ అభివర్ణించారు. ఈ మేర పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు, పంజాబ్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శులకు సిద్ధూ లేఖలు రాశారు. గత ఏడాది ఆగస్టులో ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నవజోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను కౌగిలించుకొని విమర్శలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సిద్ధూ పాక్ పర్యటనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com