శబరిమల వివాదం: ఎటూ తేల్చలేకపోయిన సుప్రీమ్ కోర్ట్

- November 14, 2019 , by Maagulf
శబరిమల వివాదం: ఎటూ తేల్చలేకపోయిన సుప్రీమ్ కోర్ట్

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేకపోయింది. ఏడుగురు జడ్జీల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ.. గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పగా.. దానిపై పదుల సంఖ్యలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విస్తృత ధర్మాసనం డిసైడ్‌ చేస్తుందని చెప్పారు.

శబరిమల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ.. ఐదుగురు జడ్జీల ధర్మాసనం 3-2 తేడాతో తీర్పు చెప్పింది. ఇతర మత విశ్వాసాలపైనా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మతంలోకి చొచ్చుకెళ్లే అధికారం.. కోర్టుకు ఉందా? లేదా? అనే అంశం చర్చకు వచ్చిందని CJI రంజన్‌ గొగోయ్ అన్నారు. మతంలో అంతర్భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారని తెలిపారు. వివిధ వర్గాల వారికి నచ్చిన విధానాలు ఆచరించే స్వేచ్ఛ ఉందన్నారు. మత విధానాలు, నైతికత.. ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండకూడదని CJI అభిప్రాయపడ్డారు.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 ఏళ్లు పైబడిన, 50 లోపు మహిళలకు ప్రవేశంపై సుప్రీంకోర్టు కొత్తగా తీర్పు చెప్పని నేపథ్యంలో.. గతంలో ఇచ్చిన తీర్పే అమల్లో ఉంటుంది. స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. కేరళ ప్రభుత్వం కూడా మహిళల ప్రవేశానికి సానుకూలంగానే ఉంది. దీంతో.. ఈ ఏడాది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి నెలకొంది. గతేడాది సన్నిధానంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలు.. ఈసారి కూడా అయ్యప్ప దర్శనానికి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. గతేడాది మహిళల ఆలయ ప్రవేశాన్ని సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్లుండి అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com